బందరు పోర్టు అభివృద్ధి ఏది?

- November 20, 2017 , by Maagulf
బందరు పోర్టు అభివృద్ధి ఏది?

కృష్ణా : టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా బందరు పోర్టు అభివృద్ధి ముందుకు సాగడం లేదు. పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణం పేరుతో కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజవర్గంలో 1.05 లక్షల ఎకరాలను సమీకరిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న బందరు పోర్టుపై పాలకులు, అధికారులు తలోమాట చెప్పడం.. పొంతన లేని ప్రకటనలు చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. 2015 ఆగస్టు 29న 33 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై రైతులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరలా 2016లో మరోసారి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ వెలువరించింది. దీన్ని వ్యతిరేకించిన రైతులు ఆయా గ్రామాల్లో సభలతో పోరాటం ఉధృతం చేశారు. మచిలీపట్నం పోర్టుతో పాటు పరిశ్రమల కారిడార్ కోసం 14వేల 620 ఎకరాలకు సంబంధించి గతంలో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ గడువును ఇప్పటికే రెండు పర్యాయాలు పెంచిన ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పాటు పెంచుతూ 2017 ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టుతోపాటు అనుబంధ పరిశ్రమల స్థాపన పేరుతో సుమారు 15 వేల ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది.
భూ సేకరణ నోటిఫికేషన్‌ వ్యతిరేకిస్తున్న రైతులు 
ఓవైపు భూ సేకరణ నోటిఫికేషన్‌ను రైతులు వ్యతిరేకిస్తుంటే.. పాలకులు సమీకరణను తెరపైకి తెచ్చారు. సమీకరణకు రైతులు ముందుకు రావడంలేదని, సేకరణ అజెండా అమలు చేయాలని అందుకు రూ.700 కోట్ల నిధులు అవసరమని మంత్రి, ఎంపీలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉండటంతో సమీకరణే కొనసాగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది ఏమైనా మచిలీపట్నం పోర్టు పనులను ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చెబుతున్నారు. పోర్టు పేరుతో ప్రభుత్వం 33 వేల ఎకరాల భూమిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు ఆరోపించారు. పోర్టు నిర్మించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లు లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందు. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com