ఈజిప్ట్‌లో కాల్పులు: 155మంది మృతి

- November 24, 2017 , by Maagulf
ఈజిప్ట్‌లో కాల్పులు: 155మంది మృతి

అంబులెన్స్‌లపైనా కాల్పులు 
కైరో: ఈజిప్టులో దారుణ మారణకాండ జరిగింది. మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ ఘటనలో సుమారు 155 మంది మృత్యువాతపడగా.. 120 మందికిపైగా గాయపడ్డారు. ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలో ఓ మసీదుకు ప్రార్థనలు చేసేందుకు వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబులు విసిరి, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన సందర్భంలో కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు, భద్రతా సిబ్బంది తెలిపారు. కాల్పుల సమయంలో మసీదు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పరుగులు తీసినట్టు పేర్కొన్నారు. ఉత్తర అరిష్‌ పట్టణంలోని బిర్‌ అల్‌-అబెద్‌లో మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణకాండలో గాయపడినవారిని చికిత్సనిమిత్తం సుమారు 30 అంబులెన్స్‌ల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్స్‌లపైనా కాల్పులకు తెగబడ్డారు.


అధ్యక్షుడు అత్యవసర భేటీ 
ఈ మారణకాండ నేపథ్యంలో ఈజిప్ట్‌ దేశాధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌ సిసీ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈజిప్ట్‌లో భద్రతా దళాలు, ఇస్లామిక్‌ స్టేట్‌ మధ్య యుద్ధం ఎప్పటినుంచో కొనసాగుతోంది. గత మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో వందలాది మంది పోలీసులు, సైనికుల్ని ఉగ్రవాదులు హతమార్చారు. ఉగ్రవాదులు ఎక్కువగా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగాఈజిప్టు ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com