12, 13 తేదీల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ దేశవ్యాప్త సమ్మె

- December 03, 2017 , by Maagulf
12, 13 తేదీల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ దేశవ్యాప్త సమ్మె

శ్రీకాకుళం : బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో ప్రయివేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 12, 13 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సంచార్‌ నిగమ్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కె.సెబాస్టిన్‌ తెలిపారు. శ్రీకాకుళంలో ఆదివారం జరిగిన సర్కిల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బిఎస్‌ఎన్‌ఎల్‌లోని అన్ని సంఘాలతో పాటు అధికారులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యమవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలతో బిఎస్‌ఎన్‌ఎల్‌ మనుగడ ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోతోందని తెలిపారు. ఫలితంగా ఈ సంస్థలో యువతకు ఉద్యోగావకాశాలు మృగ్యమయ్యాయన్నారు. ప్రయివేట్‌ ఆపరేటర్లకు ఇస్తున్న స్వేచ్ఛ బిఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం ఇవ్వడం లేదని తెలిపారు. టెలికాం రంగంలో ఆపరేటర్లందరూ నష్టాల్లో ఉన్నారని, వారితో పోల్చుకుంటే బిఎస్‌ఎన్‌ఎల్‌ కొంత మెరుగ్గా ఉందన్నారు. సెల్‌ టవర్లకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సంస్థలో పనిచేస్తోన్న 1.81 లక్షల ఉద్యోగులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న అసోసియేషన్‌ జాతీయ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరగనుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, సంస్థ మనుగడకు తీసుకోవాలని చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.విశ్వనాథం, ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రతినిధులు సిహెచ్‌. వెంకటరావు, రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com