ఇక పూర్తిస్థాయిలో ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

- December 05, 2017 , by Maagulf
ఇక పూర్తిస్థాయిలో ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌

వాషింగ్టన్‌: ముస్లిం మెజార్టీ దేశాల నుంచి ప్రజలు అమెరికా రాకుండా ఉండేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్యావెల్‌ బ్యాన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కొన్ని ఆంక్షలతో కొనసాగుతున్న ఈ నిషేధంపై ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇక పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్‌ ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇరాన్‌, లిబియా, సిరియా, యెమన్‌, సోమాలియా, ఛాద్‌ దేశాల నుంచి ప్రజలెవరూ అమెరికా రాకుండా వారిపై నిషేధం విధించారు. అయితే ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన న్యాయస్థానాలు ట్రావెల్‌ బ్యాన్‌పై కొన్ని ఆంక్షలు విధించాయి.ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గరి సంబంధీకులు అంటే అమ్మ, నాన్న, కొడుకు, కుమార్తె తదితర బంధువులకు అమెరికాలో శాశ్వత నివాసం ఉంటే వారికి అనుమతినివ్వాలని కింది కోర్టులు పేర్కొన్నాయి. 

అయితే తాజాగా సుప్రీంకోర్టు.. నిషేధంపై కింది కోర్టులు విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేయాలని పేర్కొంది. అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. దీంతో ప్రస్తుతంఅధికారులు నిషేధంపై న్యాయ అంశాలను పరిశీలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com