ఆత్మహత్య చేసుకున్న బూమ్రా తాతయ్య

- December 10, 2017 , by Maagulf
ఆత్మహత్య చేసుకున్న బూమ్రా తాతయ్య

అహ్మదాబాద్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన బౌలర్‌ జస్ప్రిత్‌ బూమ్రా ఇంట విషాదం నెలకొంది. బుమ్రా తాతయ్య సంతోక్‌ సింగ్‌ బుమ్రా(84) సబర్మతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదృశ్యమైన మరుసటి రోజే సంతోక్‌ సింగ్‌ నదిలో శవమై కనిపించాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

డిసెంబర్‌ 6న బుమ్రా పుట్టినరోజును పురస్కరించుకుని సంతోక్‌ సింగ్‌ జార్ఖండ్‌ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చారు. కానీ బుమ్రాను కలవడానికి అతని తల్లి దల్జీత్‌ కౌర్‌ ఒప్పుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే తన కుమారుడు బల్వీందర్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి చనిపోయిన తన భార్య వద్దకు వెళుతున్నానని చెప్పాడు.

ఒకప్పుడు వ్యాపారవేత్తగా బతికిన సంతోక్‌.. బుమ్రా తండ్రి చనిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇప్పుడు  తన మొదటి కుమారుడు బల్వీందర్‌ వద్ద ఉంటూ ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన్ను ఎవరూ చేరదీయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్‌ ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ అధికారులు ఆదివారం గుర్తించారు. ప్రస్తుతం బూమ్రా శ్రీలంకతో ధర్మశాలలో తొలి వన్డే ఆడుతున్న సంగతి తెలిసిందే.

చివరి కోరిక తీరుకుండానే..

ఉత్తరాఖండ్‌లో ఉద్దమ్ సింగ్ నగర్లో నివసిస్తున్న సంతోక్ సింగ్ బుమ్రానే క్రికెటర్ జస్ఫ్రిత్ బూమ్రాకు స్వయానా తాత. దాదాపు 10 ఏళ్ల నుంచి ఉత్తరాఖండ్ లోనే ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనిది స్వతహాగా అహ్మదాబాద్ అయినప్పటికీ, బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు. తన చేసే వ్యాపారంలో నష్టం రావడంతో 2006లో ఉద్దమ్ నగర్ కు మారిపోయాడు సంతోక్ సింగ్. తనకున్న మూడు ఫ్యాక్టరీలను అమ్మేసి వలస వెళ్లిపోయాడు.

84 ఏళ్ల వయసులో పడరాని కష్టాలు పడ్డాడు. ఒక రూమ్ లో ఒంటరిగా ఉంటూ బతుకు బండిని లాగుతూ వచ్చాడు.. ముఖ్యంగా 2001లో బూమ్రా తండ్రి  జస్విర్ సింగ్ మరణించిన తరువాత ఆ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోనే వారి మధ్య సంబంధం తెగిపోయి చెప్పుకునే బంధం మాత్రమే మిగిలందట. కాగా, బూమ్రా ఎదుగుదలను చూసి మురిసిపోయిన సంతోక్.. మనవడు ఆడే మ్యాచ్ ల్ని క్రమం తప్పకుండా టీవీల్లో చూసేవాడు. తాను మరణించే లోపు మనవడ్ని కలవాలని ఆశపడ్డాడు. అందుకోసం విపరీతంగా శ్రమించాడు. కాకపోతే తన చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com