మాదకద్రవ్యం వికటించడంతో స్నేహితుడి మరణం... మృతదేహాన్ని దాచిపెట్టిన మిత్రబృందం

- December 11, 2017 , by Maagulf
మాదకద్రవ్యం వికటించడంతో స్నేహితుడి మరణం... మృతదేహాన్ని దాచిపెట్టిన మిత్రబృందం

దుబాయ్:  వయస్సుని మించిన దురలవాట్లు ఆ యువకులను జైలు పాల్జేసింది. తమ తోటి ఓ స్నేహితుడు   మాదకద్రవ్యంను ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అకస్మాత్తుగా చనిపోయాడు. మిగిలిన ముగ్గురు యువకులు నిర్ఘాంతపోయారు. తమ స్నేహితుడు ఆ విధంగా మరణించడంతో వారు తీవ్రంగా  భయపడ్డారు. నేరాన్ని పోలీసులు తమపై నెడతారనే  కారణంతో మృతదేహాన్ని ఎవరూ చూడని ఒక నిర్జన ప్రదేశానికి తరలించారు. కారును శుభ్రంగా కడిగి మృతదేహాన్ని కారులో ఉంచి ఎవరికీ కనిపించకుండా లహ్‌బాహ్ అనే ప్రాంతంలో దాచిపెట్టారు. మరణించిన యువకుడి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. తిరిగి తమ తమ ఇళ్లకు వచ్చి తమకేమీ తెలియనట్టుగా నటించారు. కొడుకు కనిపించకపోవడంతో మృతుని తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు స్నేహితుడికి సంబంధించిన సమాచారం తమకేమీ తెలియదని ముగ్గరూ చెప్పారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముగ్గురిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. మృతదేహాన్ని తామే దాచిపెట్టామని తెలిపాడు. మాదక ద్రవ్యంను  ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్నేహితుడు చనిపోయాడని, భయమేయడంతో ఈ పని చేశామని చెప్పాడు. స్పృహలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, ప్రయోజనం దక్కలేదని తెలిపాడు. దీంతో నిందితులు ముగ్గురిపై కేసులు నమోదు చేసిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై కోర్టులో విచారణ మొదలైంది. నిందితుల వయసు 18, 19 సంవత్సరాలని, నిందితులందరూ విద్యార్థులని పోలీసులు తెలిపారు. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్‌లో వెలుగులోకి వచ్చింది.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com