TTD లోని అన్ని సేవలతో యాప్‌

- December 17, 2017 , by Maagulf
TTD లోని అన్ని సేవలతో యాప్‌

2018లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. తిరుపతికి చేరుకోగానే ఏడుకొండలవాడా ఎక్కడున్నావయ్యా.. వడ్డి కాసులవాడా వందనాలు అంటూ.. ఆయన ధ్యానంతో ఆధ్యాత్మిక ఆనందంతో వెతుక్కోవడం అందరూ చేసే పని. తిరుపతికి ఎంత ఆధ్యాత్మికత.. ఆనందంతో వచ్చినా తిరుమల కొండ పైకి ఎక్కగానే ఒకింత ఆందోళన వెన్నంటే వస్తుంది. కొండపై వసతి ఎలా..? దర్శనం పరిస్థితి ఏమిటి..? అసలు అక్కడున్న ఇతర ఆలయాలకు ఎలా వెళ్లాలి..? వాటి ప్రాశస్త్యం ఏమిటి..? అన్నప్రసాదం ఎలా పొందాలి..? ఏదైనా ఇబ్బంది వస్తే ఎవర్ని సంప్రదించాలి..? ఇలా ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి వాటన్నింటికీ చెక్‌ పెట్టేలా అన్ని హంగులతో సరికొత్తగా పలకరించబోతోంది.. 'గోవింద' యాప్‌. తిరుపతి:సాంకేతిక యుగంలో ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో తితిదే సైతం వేగంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసు ద్వారా ఇప్పటికే తితిదే గోవింద యాప్‌ను డిజైన్‌ చేయించింది.

ఇప్పటికే ఇందులో వసతి, సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఉంచుతున్నారు. తితిదే నెలవారీ లక్కీడిప్‌కు సంబంధించి విడుదల చేసే టిక్కెట్లను దీనిద్వారా పొందవచ్చు. రూ.50ల వసతి దగ్గర నుంచి ఇతర పెద్ద సముదాయాల వరకు ఉన్న సమాచారాన్ని గోవింద యాప్‌లో ఉంచారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి..

భవిష్యత్తులో అత్యున్నత యాప్‌గా తీర్చిదిద్దేందుకు టీసీఎస్‌ ఉద్యోగులు కృషి చేస్తున్నారు. 2018లో గోవింద యాప్‌లో మరిన్ని సౌకర్యాలు భక్తులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 అంశాలతో... ఇప్పటికే యాప్‌లో వసతి, సేవలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. భక్తులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

దీన్ని లక్షమంది వరకు ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. తవరలోనే మరో రెండు సేవలు దీనిలో అందుబాటులోకి రాబోతున్నా యి. వాటిలో తిరుమల నుంచి వివిధ దేవాలయాలకు దారి చెప్పే నావిగేటర్‌తో పాటు, తితిదే ఆధ్వర్యంలోని అన్నీ టోల్‌ఫ్రీ నెంబర్లతో కూడిన ఒక వినూత్న సౌకర్యం రానున్నాయి. హోటళ్లలో అధిక ధరలకు అమ్మితే.

తితిదేకు ఫిర్యాదు చేసే అవకాశం ఇందులో కల్పించనున్నారు. సమాచారాన్ని తితిదే అధికారులు ఇటీవల హైకోర్టుకు తెలిపారు. వీటి తర్వాత భక్తుల నుంచి వచ్చే సూచనల మేరకు మరికొన్ని సౌకర్యాలు, సాంకేతిక సౌలభ్యాలు అందుబాటులోకి వస్తాయి. అత్యంత నాణ్యతగా... యాప్‌ను టీసీఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా తయారు చేస్తోంది. భక్తజనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిలో ఒక్కో అప్లికేషన్‌ను చేరుస్తున్నారు.

తితిదే సాంకేతిక విభాగం అధికారుల సూచనల ప్రకారం ఇందులో 12 అంశాలను దశలవారీగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న యాప్‌ ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు తీసుకొని కొత్త అప్లికేషన్లు ఎలా సృష్టించాలనే దానిపై టీసీఎస్‌ అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తోంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా... ఇప్పటికే గోవింద యాప్‌ను భక్తులకు అందుబాటులో ఉంచాం. దాని ద్వారా వారి స్పందన, వారికి కావాల్సిన అప్లికేషన్లు, డయల్‌ యువర్‌ ఈవోలో వచ్చిన సూచనల ఆధారంగా కొత్త వాటిని తయారు చేస్తాం. దీనిపై పూర్తిస్థాయి పని జరుగుతోంది. వచ్చే సంవత్సరం ఇందులోని పూర్తి అప్లికేషన్లు భక్తులకు అందుబాటులోకి రావచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com