మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

- December 19, 2017 , by Maagulf
మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

టాలీవుడ్ లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. ఫోరెన్సిక్ నివేదికలో.. ఒకరి నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు తేలడంతో.. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరు అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. సిట్ అధికారులు ఆ ఒక్కరినే అదుపులోకి తీసుకుంటారా లేక.. అతడి ద్వారా మరికొందరిని అదుపులోకి తీసుకుంటారా? అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన డ్రగ్స్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. పకడ్బందీ చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా.. ఆచితూచి అడుగులు వేస్తోంది. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సిట్ వ్యవహరిస్తోంది. నటుల నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు తెలిసినా.. మరోసారి నిర్ధారణకు పంపింది. అందు వల్లే కేసు ఆలస్యమైనట్లు ఆబ్కారీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి చేరింది. ఆ నివేదిక కోరుతూ.. ఒకటి రెండు రోజుల్లో సిట్ పిటిషన్ వేయనుంది. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన చార్జిషీటు దాఖలు చేయనుంది. ఆ తరువాత అరెస్టుల పర్వానికి.. సిట్ తెరలేపే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసు కీలక సూత్రధారి కెల్విన్ సమాచారం మేరకు.. జులై నెలలో 12మంది సినీ ప్రముఖులను ఆబ్కారీ అధికారులు విచారించారు. ఆ సమయంలో.. ముగ్గురి నుంచి గోళ్లు, రక్తం, వెంట్రుకల నమూనాలను సేకరించారు. చాలా మంది ప్రముఖులు డ్రగ్స్ వాడినట్టు ప్రచారం జరిగినా ... సిట్‌ విచారణలో కేవలం ఒక్కరు మాత్రమే వీటిని తీసుకొన్నట్టు తేలింది. సరైన ఆధారాలు లేకపోవడంతో మరింత లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకోనుంది. మరోవైపు అధికారులు ఒక్క ఛార్జిషీటుతో సరిపెట్టకుండా అనుబంధ ఛార్జిషీట్లు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com