ఆన్‌లైన్‌లో వాహన విక్రయమంటూ ఘరానా మోసం

- December 22, 2017 , by Maagulf
ఆన్‌లైన్‌లో వాహన విక్రయమంటూ ఘరానా మోసం

రూ.5.5 లక్షల టోకరా నైజీరియన్‌ సహా ఇద్దరి అరెస్టు రాయదుర్గం, న్యూస్‌టుడే: ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో ఇన్నోవా వాహనం అమ్మకానికి ఉందని ప్రకటన ఉంచి ఓ వ్యక్తినుంచి రూ.5.5లక్షలు వసూలుచేసి మోసగించిన నైజీరియన్‌, అతడి ఇద్దరు అనుచరులను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టుచేశారు. రాచకొండసైబర్‌ సెల్‌ ఏసీపీ హరినాథ్‌ కథనం ప్రకారం.. నైజీరియాకు చెందిన ఓజీబుల్‌ అక్లొయమెన్‌ బెంగళూరులో ఉంటూ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నాడు. టీనా అలియాస్‌ పూజ, అర్వింద్‌కుమార్‌ అలియాస్‌ శ్రీకాంత్‌లతో ముఠా ఏర్పాటుచేశాడు. ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్లో ఇన్నోవా వాహనం అమ్మకానికి ఉందని నకిలీ ప్రకటన, చరవాణి నంబరు ఉంచాడు. భువనగిరి మల్లాపూర్‌కు చెందిన కె.సిద్దులు ఆ ప్రకటన చూసి వాహనం కొనుగోలు కోసం అతడిని సంప్రదించారు. దీంతో ఓజీబుల్‌ తన పేరు ప్రకాశ్‌ అని పరిచయం చేసుకుని, ఎన్‌ఆర్‌ఐనని, అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి రావడంతో వాహనాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారుల ఆధీనంలో ఉంచి విక్రయించిపెట్టమని చెప్పానని నమ్మబలికాడు. ఇందుకు ఎయిర్‌పోర్టు అధికారి పూజను సంప్రదించాలని చరవాణి నంబరు ఇచ్చాడు. ఆయన ఆమెను సంప్రదించగా పార్కింగ్‌ క్లియరెన్స్‌కు రూ.2లక్షలు డిపాజిట్‌ చేయాలని ఓ ఖాతా నంబరు ఇవ్వగా అయన అలాగే చేశారు.

తర్వాత ఆర్వింద్‌ కుమార్‌ శ్రీకాంత్‌ పేరుతో బాధితుడుకి ఫోన్‌ చేసి తాను కార్గోమేనేజర్‌నని, కార్గో ఛార్జీల కింద రూ.3.5లక్షలు చెల్లించి వాహనం తీసుకెళ్లాలని చెప్పడంతో డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించారు. విమానాశ్రయానికి వెళ్లి వాహనం కోసం ఆరా తీయగా అంతా మోసమని తేలింది. దీంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన ఎస్‌ఐలు ఆశిష్‌రెడ్డి, ఎం.నరేందర్‌..

చరవాణి నంబరు, ఖాతా నంబర్ల ఆధారంగా బెంగళూరుకు వెళ్లి నిందితులను అరెస్టుచేశారు. కోర్టుకు రిమాండ్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com