తప్ప తాగి డ్రైవింగ్ చేసారో..ఇక జైలే గతి

- December 23, 2017 , by Maagulf
తప్ప తాగి డ్రైవింగ్ చేసారో..ఇక జైలే గతి

దిల్లీ: మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ యాక్సిడెంట్లకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇలాంటి ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్లకు ఏడేళ్ల జైలుశిక్ష విధించాలనే యోచనలో ఉంది. అంతేగాక.. అన్ని వాహనాలకు జీవితకాల థర్డ్‌ పార్టీ బీమాను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేసి వ్యక్తుల మరణాలకు కారణమయ్యే డ్రైవర్లకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది. అయితే ఇలాంటి ఘటనల్లో బాధ్యులకు విధించే శిక్ష సరిపోవట్లేదని.. వారిని కఠినంగా శిక్షించాలని ఆ మధ్య సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఘటనను కుట్రపూరిత నేరంగా భావించి 10ఏళ్ల జైలుశిక్ష విధించాలని స్టాండింగ్‌ కమిటి కూడా సిఫార్సు చేసింది. ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. శిక్షను ఏడేళ్లకు పెంచాలని భావిస్తోంది.

అంతేగాక.. వాహనాలను రిజిస్టర్‌ చేసుకునే సమయంలో థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా తీసుకునేలా నిబంధన పెట్టనుంది. దీంతోపాటు సరికొత్త ట్రాఫిక్‌ నియమాలను కూడా తీసుకురానుంది. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే భారీ కమర్షియల్‌ వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా నిబంధన విధించనుంది.

ఈ మేరకు చట్టంలో సవరణలు చేసి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com