బీచ్ ఫెస్టివల్ పై చెలరేగుతున్న వివాదాలు ...!!

- December 23, 2017 , by Maagulf
బీచ్ ఫెస్టివల్ పై చెలరేగుతున్న వివాదాలు ...!!

ఆంధ్ర ప్రదేశ్:కోట్లు ఖర్చుపెట్టి ఆర్భాటంగా చేసిన కాకినాడ బీచ్ ఫెస్టివల్ పై వివాదలు  చెలరేగుతున్నాయి. ప్రజాధనాన్ని సముద్రం నీళ్లలాగా పారబోసి నిర్వహించిన ఈ ఫెస్టివల్‌లో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ఈ తీరే ప్రజాప్రతినిధులకు.. అధికారులకు మధ్య చిచ్చు రాజేసింది. సాధారణంగా ప్రభుత్వం నిర్వహించే సంబరాలేవైనా ప్రజాప్రతినిధుల హవానే కనిపిస్తుంది. కానీ.. కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌లో మాత్రం అంతా అధికారులే హడావుడి చేయడంతో ప్రజాప్రతినిధులు దీనికి అంటీ ముట్టనట్లు వ్యవహరించారు.

ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌. రెహమాన్‌.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్‌ వందేమాతరం శ్రీనివాస్‌తో లైవ్‌ షోలు ఏర్పాటు చేయడంతో కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌కు ఈ సారి జోరుగా ప్రచారం సాగింది. ఖర్చు కూడా అదే స్థాయిలో జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అధికారులు ఇంతవరకూ ఎక్కడా ఖర్చుపై ప్రకటన చేయకపోయినా.. దాదాపు 6 న్నర కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.  ఇంత ఖర్చు పెట్టినా.. ప్రజలను వేదికకు దూరంగా ఉంచడం... ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లకపోవడం వివాదాస్పదమయ్యింది. మెయిన్ స్టేజీ , మూడు రోజుల నిర్వహణ ముంబయికి చెందిన ఒక కంపెనీకి అప్పగించారు. అయితే.. ఎస్పీ బాలు, వందేమాతరం శ్రీనివాస్‌ల కార్యక్రమాలు ఓ ఎంపీ ద్వారా ఫిక్స్‌ అయ్యాయని తెలుస్తోంది. దీంతో.. జిల్లాకు చెందిన మరో ఎంపీ పూర్తిగా దూరంగా ఉన్నారు. 

అధికారుల తీరుతో ప్రజాప్రతినిధులు బీచ్ ఫెస్టివల్ కు దూరంగా ఉన్నారు. అంతే కాదు బీచ్ ఫెస్టివల్ లో కలెక్టర్ కలియ తిరుగుతూ సెల్ఫీలు తీసుకోవడం, ఎస్పీ ముభావంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. బీచ్ ఫెస్టివల్ మొదటి రోజు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం షో లో  ఎస్పీ విశాల్ గున్నిని స్టేజీమీదకు పిలవకపోవడం.. అధికారులు.. పోలీసులకు మధ్య చిచ్చు పెట్టింది. రెహమాన్‌ షో ముగిసిన తర్వాత ట్రాఫిక్ విషయంలో ఏమీ పట్టనట్లు వ్యవహరించడమే దీనికి నిదర్శనమంటున్నారు. ఇక మొదటి రోజు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు టీ కూడా ఇవ్వలేదని స్టేజ్‌ మీదే చెప్పడం.. నిర్వహణ ఎంత అధ్వాన్నంగా ఉందో బయట పెట్టింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే మొదటి రెండు రోజులు బీచ్ ఫెస్టివల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మూడోరోజు.. అధికారులతో చర్చించి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు హోంమంత్రి చినరాజప్ప. ప్రతీఏటా బీచ్‌ ఫెస్టివల్‌లో లోకల్‌ టాలెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు.. ఈ సారి మాత్రం కేవలం మూడు మ్యూజిక్‌ షోలతో మమ అనిపించడం.. .స్థానికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 

ఇక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలోనూ అధికారులు విఫలమయ్యారు. మొదటిరోజు బీచ్‌ ఫెస్టివల్‌లో కాకినాడ మేయర్ సుంకర పావితో పాటు ఆమె భర్తను స్టేజ్‌మీదకు పిలవడం.. అంతగా ప్రాధాన్యం లేని వ్యక్తులు స్టేజిపైకి రావడంతో నేతలకు చిర్రెత్తుకు వచ్చింది. అదే సమయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మిని మాత్రమే పిలిచి.. ఆమె భర్త సత్యనారాయణను ప్రొటోకాల్‌ పేరుతో అడ్డుకోవడంపైనా వివాదం చెలరేగింది. దీంతో.. పిల్లి అనంతలక్ష్మి బీచ్‌ఫెస్టివల్‌కు దూరంగా ఉన్నారు. చివరకు హోంమంత్రి జోక్యం చేసుకుని బుజ్జగించడంతో.. చివరిరోజు మధ్యాహ్నం మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారు. 

అటు బీచ్‌లో 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల విషయంలోనే ఈ వివాదం రేగిందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. బీచ్‌ ఫెస్టివల్ సమయానికి పనులు పూర్తి కాకపోవడంపై పర్యాటకశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు కలెక్టర్‌. ఈ పనులు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అనుచరులే  చేస్తున్నారు. దీనివల్లే ఎమ్మెల్యేకు.. అధికారులకు మధ్య గ్యాప్ వచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి.  మొత్తానికి అధికారుల ఓవర్‌యాక్షన్‌తోనే కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ కళ తప్పిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com