అమరావతికి రానున్న తెలుగు చిత్ర పరిశ్రమ

- December 25, 2017 , by Maagulf
అమరావతికి రానున్న తెలుగు చిత్ర పరిశ్రమ

తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాజధాని పరిధిలోని అనంతవరం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 5,167 ఎకరాల్లో మీడియా సిటీని సిద్ధం చేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికే చర్చలు జరిపిన ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆకర్షించాలని యోచిస్తోంది. ప్రతిపాదిత స్థలంలో 20-30 ఎకరాల్లో స్టూడియో నిర్మించనుంది. స్టూడియో నిర్మాణానికి ముందుకొచ్చే వారికి ఎకరం రూ.50 లక్షల నామమాత్రపు ధరతో భూములు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ నిర్మించే సినిమాలకు ప్రొడక్షన్ ఖర్చులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించడంతోపాటు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. అలాగే సినిమాలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని యోచిస్తోంది. అమరావతిలో ప్రారంభించే న్యూస్ చానళ్లకు కూడా నామమాత్రపు ధరకే భూములు కేటాయించనుంది. తొలి దశలో రాజధానికి మీడియా హౌస్‌లను రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రెండో దశలో అంటే 2021 నుంచి 2036 మధ్య అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఓ స్టూడియోను నిర్మించనున్నట్టు సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మేరకు ఇప్పటికే తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుండగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, సుభాష్ ఘయ్‌లతో స్టూడియో నిర్మాణంపై చర్చలు జరిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com