రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చైనా: ట్రంప్‌

- December 29, 2017 , by Maagulf
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చైనా: ట్రంప్‌

ఉత్తరకొరియా చమురు దిగుమతులు చేసుకోకుండా ఆ దేశంపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా.. ఉత్తరకొరియాకు చమురు సరఫరా చేస్తోందని వార్తలు వచ్చాయి. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. చైనా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందంటూ దుయ్యబట్టారు. 'రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఉత్తరకొరియాకు చైనా చమురు నిల్వలను పంపడం విచారకరం. ఇదిలాగే కొనసాగితే.. ఉత్తరకొరియా సమస్యకు సానుకూల పరిష్కారం దొరకదు' అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాలను రెచ్చగొడుతున్న ఉత్తరకొరియా ఆగడాలను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా గత సెప్టెంబర్‌లో ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. సముద్ర మార్గం ద్వారా ఉత్తరకొరియా చమురు దిగుమతులు చేసుకోకుండా ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి ఐరాస ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఉత్తరకొరియా అతి శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీంతో ఆ దేశాన్ని అణచివేసేందుకు మరిన్ని ఆంక్షలు విధించాలని కోరుతూ అమెరికా మరోసారి తీర్మానం తీసుకొచ్చింది. ఇందుకు ఐరాస ఆమోదించింది.

అయితే ఐరాస నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా ఉత్తరకొరియాకు సాయం చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. గత అక్టోబర్‌ నుంచి ఉత్తరకొరియాకు చైనా 30 సార్లు చమురు సరఫరా చేసిందని దక్షిణకొరియా అధికారులు ఆరోపించారు. సముద్ర మార్గం ద్వారా చైనా ఓడలు ఉత్తరకొరియా ఓడలకు చమురు సరఫరా చేయడాన్ని అమెరికా శాటిలైట్లు గుర్తించాయని పేర్కొన్నారు. అటు అమెరికా వార్తాసంస్థలు కూడా ఈ కథనాన్ని ప్రచురించాయి.

అయితే చైనా మాత్రం తమకేమీ తెలియదని చెబుతోంది. తాజా వార్తల గురించి తమకు తెలియదని.. ఉత్తరకొరియాపై వాణిజ్య ఆంక్షలను చైనా కఠినంగా అనుసరిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతో స్పందించిన ట్రంప్‌ చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com