ముంబై మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

- December 29, 2017 , by Maagulf
ముంబై మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ముంబైలో ఘోరం జరిగింది. నగరం నడిబొడ్డున ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌ తగలబడింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. అందులో 12 మంది మహిళలు ఉన్నారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఓ పబ్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యువతి.. ఆమె స్నేహితులు సైతం ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఫ్రెండ్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు యువత పెద్దసంఖ్యలో పబ్‌కు వచ్చారు. అక్కడే ప్రమాదం సంభవించడంతో కొందరు సజీవ దహనం అయ్యారు.

ముంబై లోయర్‌ పరేల్‌లోని కమల మిల్స్‌ కాంపౌండ్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంగణంలో చాలా కార్యాలయాలు, రెస్టారెంట్‌లు, పబ్‌లు ఉన్నాయి. రూఫ్‌ టాప్‌లోని ఓ పబ్‌లో మంటలు చెలరేగినట్టు సాక్షులు చెప్తున్నారు. ఫైర్‌ బాటిల్స్‌తో ఆడుతుండగా ఎక్కడో పొరపాటు జరిగింది. దీంతో.. అగ్ని కీలలు రాజుకున్నాయి. చూస్తున్నంతలోనే విస్తరించాయి. క్షణాల్లో ఫ్లోర్ మొత్తం వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో బిల్డింగ్ మొత్తం విస్తరించాయి. పబ్‌లో మద్యం బాటిళ్లు ఎక్కువగా ఉండడంతో అవి అగ్నికి ఆజ్యంలా తోడయ్యాయి. మంటలు విస్తరించేందుకు కారణమయ్యాయని అధికారులు భావిస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి దాటాక ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో బయటకు వచ్చేందుకు దారులు మూసుకుపోయినట్టు సాక్షులు చెప్తున్నారు. దీంతో.. చాలామంది అక్కడి వాష్‌రూమ్‌లోకి వెళ్లారు. దానికి వెంటిలేటర్‌ లేకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. దట్టమైన పొగ చుట్టుముట్టడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. స్పాట్‌లో కొందరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు.

ముంబైలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ముంబై పోలీసులు పబ్ యజమానిపై కేసు నమోదు చేశారు. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని సమాచారం. ఆ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యాలయాలు, రెస్టారెంట్లు, పబ్‌లు చాలానే ఉన్నాయి. అయితే.. భవనంలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే ద్వారం ఉందని స్థానికులు చెప్తున్నారు. దీని వల్లే చాలామంది భవనంలో చిక్కుకుపోయి చనిపోయారని అంటున్నారు. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది మూడు గంటలు శ్రమించాల్సి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com