గాయం నా గేయం

- November 20, 2015 , by Maagulf

 

 

నీరు నింగి నేల గాలి నిప్పు.. పంచభూతాల సాక్షిగా 

అందరం కలిసి మెలిసి ఆ అనాగరికపు అడివిలో 

 

అనేక వృత్తులుగా నాగలికి మట్టికి తోడై 

మట్టికుండలో మెతుకులమై 

 

అందరమూ ఒకటే అయి ఒకే గుంపుగా ట్రైబల్ నృత్యాలు 

ఆటవిక సాంప్రదాయాల్లో నడయాడి 

 

కొద్ది కొద్దిగా ఉచ్చులుగా బిగుసుకున్న 

 

అన్ని అధికార బంధనాలు, పెద్దరికపు పోకడల 

సంకెలలు తెంచుకొని 

 

ఒకరికి ఒకరం ఆసరా అయి అందరం ఒకటిగా  

అయి శ్రమైక జీవనం సాగిస్తుండగా 

 

ఎక్కడి నుండి వచ్చారో కానీ ఆ దుర్మార్గులు 

ఈర్ష్య ,ద్వేషం,పగ,ప్రతీకారం అనే అగ్ని కీలలై 

 

స్త్రీ పురుష లింగ వివక్షల లో అణగారిన మహిళా 

జీవితం పై గొంతెత్తిన మానవిల మధ్య 

 

మానవత్వం మంట గలుపుతున్న మనిషికి 

మంచితనపు కొత్త తొడుగులు వేస్తున్న 

కవి పుంగవుల మధ్య .. 

 

ఒకరి దారిని ఒకరు గౌరవించుకోలేని వారిగా మార్చి 

వెక్కిరింతలు ఎకసెక్కాలు మంటలు రేపి .. 

 

మెదడున్న మనిషి అనుసరించే ధర్మాల మధ్య,

 

సర్వ వ్యత్యాసాల దుమారాలు లేపి  

ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టి ,, 

 

విశ్వ ప్రేమికుడనుకున్న కవి తనను తానూ కోల్పోతూ ఉంటే, 

 

నువ్వేమో ... అధిక వర్గం చేసిన తీర్పును 

అభద్రతగా మార్చుకొని మెజారిటీ ప్రజల్ని 

 

నీకు నాకు ఇంకొకరికి కాని వారిగా భావించుకొని .... 

ఒక  'సిస్టర్' గా మొహం చినబుచ్చుకొని 

ఒక 'భాయి' అవమానంగా తలవంచుకొని 

 

ఎందుకో మనసు కష్ట పెట్టుకుంటుంటే.. 

 

కేవలం  శ్రోతనైన నేను,,మనిషిని మనిషిలా ..నిల బెట్టి

 

వారిని ఓదార్చను లేక స్వంత వారిపై గెలుపును ఆస్వాదించే 

కొందరు అల్ప సంతోషులకు పూర్తి మద్దతు తెలుపను లేక 

 

అందరం ఒక్కటేనని జీవునికి పరమాత్మ ఒకడే నని 

ఆస్తికునికి... 

 

చూసేదంతా సూన్యమని నాస్తికునికి తెలిసిన కానీ,

 

ఇంకను అరమరికలు లేని మానవునిగా నిలబెట్టి 

బట్ట కట్టించే నాథుడు లేక...  

 

ఎవరికీ వారు గిరి గీసుకున్న, మెదడు గడ్డకట్టిన రోగులై 

 

"బావిలోని కప్పల్లా " బెక బెక మంటూ, ఎన్నాళ్ళు? 

 

నిజమే...తర తరాలుగా విజ్ఞ్యత మరచిన చోటల్లా

హింసా ప్రతీకార జ్వాలలు రగులుతేనే ఉన్నాయి.. 

 

చరిత్ర మొత్తం రక్తం ఏరులై పారుతూ ఎక్కడో ఒక చోట 

"గాయం" చేస్తూనే ఉంది .. 

 

దానికే మనం మనసులుగా విడిపోయి .. 

 

క్షణ కాలం కోసం పుట్టిన మన ఇంటిలోనే 

అగదాలు తవ్వుకోవడం ఎందుకు? 

 

మనం మన సమ సమాజ నిర్మాణానికి పాటుపడుదాము .. 

వివక్ష జరిగిన చోట నిగ్గదీసి అడుగుదాము,పరిపాలన సజావుగా 

సాగేలా అందరం కాపు కాద్దాం.. 

 

రాబోవు మానవత్వ పరిమళాల వెలుగులకై పరితపిద్దాం 

 

సంకుచిత మనస్కుడవుతున్న మేధావి వర్గం మనసు 

మారి,వారు అందించే ఆసరా కోసం వేచి చూస్తూ ..... 

 

ఈ దేశం నీది నాది మరెవ్వరిదో కాదు మనందరిదని 

జై భారత్ అని ప్రపంచానికి చాటుదాం !!!

 

--జయ రెడ్డి బోడ (అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com