ఇక రజని మక్కల్‌ మండ్రం

- January 06, 2018 , by Maagulf
ఇక రజని మక్కల్‌ మండ్రం

చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమాన సంఘం పేరు మారింది. ఇక, రజని మక్కల్‌ మండ్రంగా అభిమాన సేన ముందుకు సాగనున్నారు. కథానాయకుడు గత ఏడాది చివరి రోజున రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. తమ నాయకుడికి మద్దతుగా అభిమాన లోకం ఉరకలు వేస్తున్నది. ఓ వైపు అభిమానుల్ని ఏకం చేస్తూ, మరోవైపు రాజకీయ పార్టీ ఏర్పాటు మీద తలైవా దృష్టి కేంద్రీకరించారు. ఇందుకు తగ్గ ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అదే సమయంలో ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్‌ సంక్రాంతి పర్వదినం వేళ పార్టీ విషయంగా కొత్త కబురు అందించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అభిమాన లోకం ఇక, రజనీ మక్కల్‌ మండ్రంగా ప్రజాసేవకు అంకితం అయ్యేందుకు నిర్ణయించడం గమనార్హం.

మక్కల్‌ మండ్రం:  కథానాయకుడికి అభిమాన లోకం దేశ విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆదిశగా 22 వేల సంఘాల ఆయనకు రిజిస్టర్‌ అయి ఉన్నాయి. అలాగే, మరో ముఫ్‌పై వేల వరకు సంఘాలు రిజిస్టర్‌ కాకుండానే, తమ సేవల్ని అందిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నీ ఒకే వేదిక మీదకు తెస్తూ కొత్త సంవత్సరం తొలి రోజున రజనీ ఓ నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత రజనీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ పేరిట వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు.

 ఇందులో తనకు మద్దతుగా నిలబడే వారు, తమిళనాట మార్పును ఆశిస్తున్న వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని రజనీ పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు స్పందన ఆశాజనకంగానే ఉన్నది. ప్రస్తుతానికి యాభైలక్షల మంది వరకు తమ పేర్లను అందులో నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంఘాన్ని ఇక, మక్కల్‌ మండ్రంగా మార్చేసి, ప్రజాసేవలో విస్తృతంగా దూసుకెళ్లేందుకు అభిమాన సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు రజనీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రజని మండ్రం పేరును శనివారం మార్చేశారు.

రజనీ మక్కల్‌మండ్రం (రజనీ ప్రజా సంఘం)గా ఇక, సేవల్ని అభిమాన లోకం విస్తృతం చేయనుంది. ఇన్నాళ్లు సినిమా రిలీజ్‌ సమయాల్లో హంగామా సృష్టించిన అభిమాన సంఘాలు, ఇక, రజనీ మక్కల్‌ మండ్రం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు అడుగులు వేశాయి. ప్రజాహిత కార్యక్రమాలు వేగవంతం చేయనున్నామని, ప్రజల్లో తమ నాయకుడికి మద్దతు హోరెత్తడం లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ఆ మండ్రం వర్గాలు పేర్కొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com