గ్యాంగ్ సినిమా రివ్యూ
- January 12, 2018
చిత్రం: గ్యాంగ్
నటీనటులు:సూర్య.. కీర్తిసురేశ్.. కార్తిక్.. రమ్యకృష్ణ.. బ్రహ్మానందం.. కలైయరసన్.. నంద, ఆర్జే బాలాజీ.. సెంథిల్.. వినోదిని.. వైద్యనాథన్ తదితరులు
ఛాయాగ్రహణం:దినేశ్ కృష్ణన్
కూర్పు: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: అనిరుధ్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్ రాజా.. వంశీ, ప్రమోద్
దర్శకత్వం: విఘ్నేష్ శివన్
సంస్థ: స్టూడియో గ్రీన్
సమర్పణ: యు.వి.క్రియేషన్స్
విడుదల తేదీ: 12-01- 2018
తెలుగు స్టార్ కథానాయకుల స్థాయిలో తనకు మార్కెట్‌ని సృష్టించుకొన్నారు సూర్య. అందుకే ఆయన సినిమాలపై తమిళం స్థాయిలోనే తెలుగులో అంచనాలు క్రియేట్ అవుతుంటాయి. ఈ సంక్రాంతికొస్తున్న సినిమాల్లో `గ్యాంగ్` కూడా ఓ కీలకమైన సినిమాగా పరిగణిస్తూ వచ్చారంతా. హిందీలో విజయవంతమైన `స్పెషల్ ఛబ్బీస్` స్ఫూర్తితో యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రం కోసం తొలిసారి సూర్య తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. మరి సూర్య `గ్యాంగ్` ఎలా ఉంది? ఆయన సంక్రాంతి విజేతగా నిలుస్తాడా లేదా?
కథేంటంటే: బాగా చదువుకున్న తిలక్ (సూర్య) ఎప్పటికైనా సీబీఐ ఆఫీసర్ కావాలని కలలు కంటుంటాడు. కానీ, తన తండ్రి సీబీఐలో ఓ క్లర్క్ కావడంతో ఇంటర్వ్యూలో అవమానం జరుగుతుంది. ఉద్యోగం రాదు. తిలక్ స్నేహితుడు పోలీసు కావాలని కలలు కంటుంటాడు. లంచం ఇస్తేనే ఉద్యోగం అని చెప్పడంతో వేరే దారిలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవన్నీ చూసి కడుపు మండిన తిలక్ తనే అనధికారికంగా సీబీఐ అధికారి అవతారం ఎత్తాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే కష్టాల్లో ఉన్న వారితో కలిసి ఒక గ్యాంగ్‌ను కూడా ఏర్పాటు చేస్తాడు. సీబీఐ పేరు చెప్పి అక్రమార్కుల నుంచి డబ్బు కాజేయడమే ఈ గ్యాంగ్ పని. ఆ డబ్బునంతా సొంతానికి కాకుండా మంచి పనుల కోసం వినియోగిస్తుంటారు. మరి ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిజమైన సీబీఐ అధికారులు ఏం చేశారు? గ్యాంగ్ సభ్యులు పట్టుబడ్డా రా?లేదా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే...
ఎలా ఉందంటే: 1987 నేపథ్యంలో జరిగే కథ ఇది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని ఎత్తిచూపుతూ వారి బాధ్యతను గుర్తు చేస్తుంది. తొలి సగభాగం సినిమా పాత్రల నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. నకిలీ సీబీఐ గ్యాంగ్ అక్రమార్కుల సొమ్మును కాజేసే సంఘటనలతో సాగుతుంది. ఆ సన్నివేశాల్లోనే వినోదాన్ని మేళవించడంతో సరదా సరదాగా సాగుతుంది. గ్యాంగ్ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెబుతూ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. అవి హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. విరామం సమయానికి సీబీఐ అధికారులకు గ్యాంగ్ ఆచూకీ తెలుస్తుంది. ద్వితీయార్ధం మొత్తం ఆ గ్యాంగ్‌ను వెంటాడే ప్రయత్నం... గ్యాంగ్ కూడా సీబీఐ అధికారులకు దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేయడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అంతా ఓ ఎత్తైతే.. పతాక సన్నివేశాలు మరో ఎత్తు. అక్కడ మలుపులు, సందేశం హత్తుకునేలా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే: సూర్య అభినయం చిత్రానికి ప్రధాన బలం. ఓ మధ్యతరగతి యువకుడిగా, గ్యాంగ్‌కు లీడర్‌గా చక్కటి నటన కనబరిచాడు. సీబీఐ ఆఫీసర్ ఝాన్సీరాణిగా మారిన బుజ్జమ్మ పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకుంటుంది. సీబీఐ బాస్ శివశంకర్ పాత్రలో సీనియర్ నటుడు కార్తిక్ కనిపించడం బాగుంది. కీర్తిసురేశ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితం అయ్యింది. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు సందడి చేస్తాయి. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. 1987 నేపథ్యానికి తగ్గట్టుగా సంగీతం అందించడంలో అనిరుధ్ చక్కటి పనితీరును కనబరిచారు. దినేశ్ కృష్ణన్ ఛాయాగ్రహణం బాగుంది. విఘ్నేష్ శివన్ 'స్పెషల్ 26' స్ఫూర్తితో కథ రాసుకున్నా.. దక్షిణాదికి తగ్గట్టు మార్పులు చేసుకున్నారు. సన్నివేశాల్లోనే వినోదం మేళవించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.
బలాలు
నటీనటుల ప్రతిభ
ద్వితీయార్ధం
సందేశం
బలహీనతలు
- సాదాసీదా ప్రథమార్ధం
చివరిగా: మంచి 'గ్యాంగ్'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్‌కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్‌లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!