వసంత 'శ్రీ' పంచమి: స్పెషల్ స్టోరీ

- January 21, 2018 , by Maagulf
వసంత 'శ్రీ' పంచమి: స్పెషల్ స్టోరీ

మాఘమాసపు శుక్ల పక్ష పంచమి నుండి వసంత ఋతువు ఆరంభమగును.ఈ సమయంలో వసంతోత్సవము ప్రకృతి యొక్క ఉత్సవము ఎల్లప్పుడు సుందరమనిపించెడి ప్రకృతి, వసంత ఋతువునందు పదహారు కళలతో వికసించును.యౌవనం అనునది మన జీవనములో వసంతం లాంటిది.ఈ సృష్టియొక్క యౌవనం వసంత ఋతువు.మాఘ శుద్ధ పంచమి రోజున వసంత పంచమి (శ్రీ పంచమి)

పర్వదినం వస్తుంది.ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు.

ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు.వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేసిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు తెలుపుతారు.రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. 'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది.

ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో ఉంది.

వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు.

సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.

సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌

వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు.

ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు.

వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి.

మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది.

ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.

అమ్మవారికి తెల్లనిరంగు పువ్వులు లతో పూజలు,క్షీరాన్నం ,నేతి పిండివంటలు, చెరుకు,అరటిపండ్లు నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని అంటారు

కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు.

అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి.

ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.

చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com