పిల్లలున్న బస్సుపై కర్ణిసేన దాడి: దేశాన్ని తగలబెడుతోందంటూ బీజేపీపై రాహుల్

- January 25, 2018 , by Maagulf
పిల్లలున్న బస్సుపై కర్ణిసేన దాడి: దేశాన్ని తగలబెడుతోందంటూ బీజేపీపై రాహుల్

న్యూఢిల్లీ: వివాదాస్పద 'పద్మావత్' సినిమా విడుదల నేపథ్యంలో కర్ణిసేన దాడులు చేస్తూ హింసాత్మక సంఘటనకులకు పాల్పడుతోంది. రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో వీరి ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీ, హర్యానా, గుర్గావ్ ప్రాంతాల్లో కూడా వీరి ఆందోళనలు పెచ్చిమీరిపోయాయి.

బుధవారం సాయంత్రం గరుగ్రామ్‌లో జీడీ గోయెంకా పాఠశాల బస్సుపై లోపల పిల్లలు ఉండగానే కర్ణిసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో బస్సులోని పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు సురక్షితంగా బస్సును అక్కడ్నుంచి తరలించే ప్రయత్నం చేసేలోపే ఈ దాడి జరగడం గమనార్హం.

బస్సులో చిన్న పిల్లలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. సీట్లు, బస్సు ఫ్లోర్ అంతా కూడా పగిలిన అద్దాల ముక్కలతో నిండిపోయింది. రాళ్లదాడితో పిల్లలంతా భయాందోళనలతో కేకలు వేశారు. బస్సులోని ఉపాధ్యాయులు పిల్లలకు దెబ్బలు తగలకుండా చూసుకున్నారు. సీట్ల కింద దాక్కోవాలని, కిందపడుకోవాలని పిల్లలకు సూచించారు. పిల్లలు అలాగే చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

కాగా, బస్సులో పిల్లలుండగానే దాడి చేయడంపై పట్ల కర్ణిసేనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతియుతంగా నిరసన చేసుకోవచ్చు గానీ, ఇలా హింసాత్మకంగా చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ దాడిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు.

'పిల్లలపై హింసకు కారణం ఎత్త పెద్దదైనా అది ఎన్నటికీ సమర్థనీయం కాదు. హింస, విద్వేషాలు బలహీనుల ఆయుధాలు. బీజేపీ హింసను, విద్వేషాన్ని ఉపయోగించుకుంటూ దేశాన్ని తగలబెడుతోంది' అని రాహుల్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బస్సు ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన కారణంగా సిగ్గుతో తాము ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఘాటుగా స్పందించారు. ముస్లింలు, దళితులు, ఇప్పుడు స్కూల్ పిల్లలపై దాడి చేసినా వారు నోరుమెదపకుండా ఉంటున్నారని బీజేపీ ప్రభుత్వాలపై కేజ్రీవాల్ మండిపడ్డారు.

కాగా, స్కూల్ బస్సు దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన 18మంది కర్ణిసేన కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com