నిషా కళ్ల నిరోషా బర్త్డే స్పెషల్

- January 30, 2018 , by Maagulf
నిషా కళ్ల నిరోషా బర్త్డే స్పెషల్

గ్లామర్ హీరోయిన్ అంటే.. తీరైన ఒళ్లు.. తెల్లని రంగు.. నిలువెత్తు అందం.. అంటూ ఏవేవో ఊహించుకుంటారు.. కానీ అవేవీ పెద్దగా లేకుండానే గ్లామరస్ హీరోయిన్ గా తన మత్తైన చూపుల్తో గుచ్చేసిన హీరోయిన్ నిరోషా. ఒకప్పుడు తన వాలు కళ్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన బ్యూటీ ఆమెది. తమిళంతో మొదలుపెట్టి... తమిళ, కన్నడ, మళయాల సీమల్లో సినిమాలను అభిమానులను సంపాదించుకున్న ఈ సిందూరపువ్వు పుట్టిన రోజు ఇవాళ. 

అలనాటి చలాకీ తారల్లో ఒకరైన రాధిక చెల్లెలు నిరోషా. పుట్టింది శ్రీలంకలో. ఆమె తండ్రి కూడా నటుడే. అందుకే తమ కుటుంబం నుంచి రాధిక హీరోయిన్ అయినా నో చెప్పలేదాయన. తర్వాత రాధిక ప్రోత్సాహంతో తనూ సినిమా రంగంలోకి రావాలనుకుంది నిరోషా. 

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కళ్లకు నిరోషాలోని సెక్సీనెస్ కనిపించింది. అందుకే తను తీస్తోన్న అగ్ని నక్షత్రం అనే సినిమాలో నిరోషాను ఒక హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ సినిమాలో కార్తీక్ సరసన ఎంతో ఛలాకీగా కనిపించి తన వాలు కళ్లతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమానే తెలుగులో ఘర్షణగా డబ్ అయింది. అలా ఒక బృందావనం.. సోయగం అంటూ తెలుగువారినీ ఆకట్టుకుంది.. 

మణిరత్నం లాంటి డైరెక్టర్ ఒకే చెప్పాక ఇంక కెరీర్ ఆగుతుందా.. అన్నట్టుగానే చాలా వేగంగా పరుగులు పెట్టింది నిరోషా కెరీర్. వెంటనే మళయాల సీమ నుంచి పిలుపొచ్చింది. వినీత్ సరసన సినిమా అదీ మంచి విజయం సాధించింది. తర్వాత రాంకీ హీరోగా తెరకెక్కిన పర్వైగల్ పర్వైతమ్ అనే సినిమా చేసింది. అలా వీరి మధ్య పరిచయం పెరిగింది. అయితే నిరోషకు తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ తిరుగులేని క్రేజ్ తెచ్చింది మాత్రం సెంతూరపూవే. ఇదే తెలుగులో సిందూరపూవుగా వచ్చింది. ఇందులోని కథ, పాటలు ఎంత హిట్ అయ్యాయో.. నిరోషా, రాంకీల జంటా అంతే హిట్ అయింది. 

రాధిక సిఫారసులు కూడా అవసరం లేకుండానే చాలా తక్కువ టైమ్ లోనే నిరోషాకు గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగు నుంచీ ఆఫర్స్ మొదలయ్యాయి. అలా తను తెలుగులో చేసిన మొదటి సినిమా నారీ నారీ నడుమ మురారీ. ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నిరోషా నటనకు హొయలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో నిరోషా ఇక్కడా హాట్ ఫేవరెట్ అయిపోయింది. 

తర్వాత నిరోషాకు తెలుగులో చాలా అవకాశాలే వచ్చాయి. కానీ అప్పటికే అటు తమిళ, కన్నడ సినిమాల్లో ఒప్పేసుకున్న సినిమాలతో బిజీగా ఉండటంతో వెంటవెంటనే తెలుగులో నటించలేకపోయింది. తమిళం తర్వాత నిరోషా ఎక్కువ సినిమాలు చేసింది కన్నడలోనే. అప్పుడు టాప్ హీరోలుగా ఉన్నవారందరితోనూ రొమాన్స్ చేసి తనూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 

ఏదేమైనా తెలుగులో డిటెక్టివ్ నారద సినిమా తర్వాత మళ్లీ ఆమె ఇక్కడ కనిపించలేదు. అయినా చేసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుందిక్కడ. అయితే ఇతర భాషల్లో మంచి అవకాశాలువస్తున్న టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. దీంతో అవకాశాలు సడెన్ గా ఆగిపోయాయి. అప్పుడు కానీ తను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. 

కనీసం మళ్లీ తను నటిగా ప్రయత్నాలు ప్రారంభిద్దామనుకుంటే పెళ్లి తర్వాత ఎవరూ గుర్తు పట్టలేనంతగా బాగా లావెక్కిపోయింది నిరోషా. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఛాన్సులు అడిగే అవకాశం కూడా లేకపోయింది. చివరికి ఎలాగోలా అన్ని సమస్యల నుంచి గట్టెక్కింది. మధ్యలో సొంతంగా తనే నిర్మాతగా మారి కొన్ని టివి సీరియల్స్ కూడా చేసింది. ప్రస్తుతం ఆ సీరియల్స్ తో పాటు కొన్ని తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.

పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ పిల్లలు వద్దనుకున్నారట. అందుకే వారికి పిల్లలు లేరు. ఎవరైన అనాథలను దత్తత తీసుకుని వారికి కొత్త జీవితాన్నివ్వాలని నిర్ణయించుకున్నారట. మరి ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎంతమంది పిల్లలను దత్తత తీసుకున్నారో తెలియదు కానీ, ప్రస్తుతం ఫిజిక్ తగ్గించుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోందీ సిందూరపూవు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com