మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

- February 06, 2018 , by Maagulf
మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టిన ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు.తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన అందరికీ సుపరిచితులు. విపక్షాలపై ధ్వజమెత్తడంలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

పుత్తూరు ఎమ్మెల్యేగా రికార్డుల కెక్కి.. 

ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ, ఎంఏతోపాటు న్యాయవాద డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. విద్య (1984), అటవీశాఖ (1987), ఉన్నత విద్య (1994) మంత్రిగా సేవలందించారు. తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో తెదేపాలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com