ఈవెంట్ల టిక్కెట్ల ముసుగులో హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయం..
- February 06, 2018
హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాదారులను ఒక పక్క ఏరిపారేస్తుండగా.. మరో పక్క నుంచి కొత్తవారు పుట్టుకొస్తున్నారు. డ్రగ్స్ విక్రేతలు ఎక్కువగా విద్యార్ధులు, యువకులపైనే దృష్టి పెట్టి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నైజీరియన్ దేశం నుంచి చదువులు, వ్యాపారం, విజిటింగ్ వీసాలపై వచ్చే వారు దేశ వ్యాప్తంగా పట్టుబడుతున్న డ్రగ్స్ రాకెట్లలో కీలక సూత్రధారులుగా ఉంటున్నారు. ఇదే కోవలో హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేయగా అందులో ఓ నైజీరియన్ డ్రగ్స్ సరఫరాలో కీలక భూమిక పోషిస్తుండగా దానిని యువతకు సరఫరా చేయడానికి రెండో ఏజెంట్‌గా కాశ్మీరీ వ్యాపారి చురుకుగా వ్యవహారిస్తున్నాడు. కాశ్మీర్ శ్రీనగర్‌కు చెందిన అబిద్ నజీర్ అలియాస్ టైగర్ పదేండ్ల క్రితం గోవా వెళ్లి అక్కడే వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డ్రగ్స్‌కు అలవాటు పడటమే కాకుండా అక్కడకు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే వారితో పరిచయాలు చేసుకుంటూ వారిని మాదక ద్రవ్యాల మత్తులోకి దింపడమే కాకుండా వాళ్లకు కూడా డ్రగ్స్ వ్యాపారం రుచిచూపిస్తున్నాడు. ఇలా నైజీరియన్లకు చెందిన ఫ్రైడే అగ్లా అలుమ్హు నుంచి కొని వాటిని పరిచయం అయిన వారికి టైగర్ విక్రయస్తున్నాడు. ఇలా హైదరాబాద్‌కు చెందిన బీబీఏ విద్యార్ధి యాష్ సుంకర తరుచు గోవాకు వెళ్తూ టైగర్‌తో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు.
ఎల్‌ఎస్‌డీ, చరస్, హేరాయిన్ డ్రగ్స్ వాడుతూ మత్తులో తేలిపోయేవాడు. తనకు మత్తు అలవాటయిన తరువాత దానిని తన స్నేహితులకు అలవాటు చేశాడు. హైదరాబాద్‌లోని తన స్నేహితులకే కాకుండా, వారి స్నేహితులు, ఇంజినీరింగ్, మెడిసన్ చేసే విద్యార్థులకు సైతం డ్రగ్స్‌ను అలవాటు చేస్తూ వారికి సరఫరా చేస్తున్నాడు. ఈవెంట్ల టెకెట్లతో ఎల్‌ఎస్‌డీ స్టాంప్స్..! యాష్ చదువుతున్నది బీబీఏ రెండో సంవత్సరమే అయినా గోవా, ముంబాయి ట్రిప్పులు కొట్టడంలో ఆరితేరాడు.
ఇతనికి హైటెక్‌సిటీ ప్రాంతంలో ఉన్న ఓ పబ్బుతో మంచి సంబంధాలున్నాయి. ఈ పబ్బులో జరిగే ఈవెంట్లకు సంబంధించిన సమాచారం యాష్‌కు ముందే తెలుస్తుంది. ఆ పబ్బుకు సంబంధించిన వారితో ఉన్న పరిచయాలతో ఆయా ఈవెంట్లకు సంబంధించిన టిక్కెట్లు ముందుగానే యాష్‌కు అందుతుంటాయి. కొన్నిసార్లు ముంబాయికి వెళ్లి ఆ పబ్బులోని ఈవెంట్లకు సంబంధించిన టిక్కెట్లను బుక్ చేసుకుంటాడు.
ఆయా ఈ వెంట్లకు వెళ్లేవారు యాష్‌ను సంప్రదిస్తూ టిక్కెట్టు కావాలని కోరుతుంటారు. దీంతో ఆయా టిక్కెట్లను రెట్టింపు ధరకు విక్రయించడంతో పాటు వారికి డ్రగ్స్‌ను కూడా విక్రయిస్తుంటాడు. తనకు తెలిసిన వారు, నమ్మకస్తులైతే వారికి పబ్బులోకి వెళ్లే సమయంలో ఓ ఎల్‌ఎస్‌డీ స్టాంప్‌ను విక్రయిస్తాడు. పబ్బులకు వెళ్లేవారిలో ఎక్కువగా ఇంజనీరింగ్, మెడికల్ చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు.
తండ్రి వ్యాపారీ కావడంతో యాష్ ఆర్థికంగా బలంగా ఉన్నాడు. దీంతో ఒక పక్క చదువు.. మరో పక్క డ్రగ్స్ దందాను యాష్ యథేచ్చగా నిర్వహిస్తున్నాడు. గోవాకు తరుచూ వెళ్తుంటాడు.
స్నేహితులతో కలిసి వెళ్తే కారులో, ఒంటరిగా వెళ్లే సమయంలో బస్సులో గోవాకు వెళ్తుంటాడు. స్నేహితులతో కలిసి గోవాకు వెళ్తే స్నేహితులను ఒక దగ్గర కూర్చోబెట్టి టైగర్‌ను కలిసి డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తాడు. దానిని వారి స్నేహితులకు అక్కడే అవసరమైతే విక్రయించి, నగరానికి తెచ్చి మరింత మందికి సరఫరా చేస్తుంటాడు. డ్రగ్స్ యూజర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ నజర్..! డిగ్రీ విద్యార్థి డ్రగ్స్ దందా వ్యవహారం బయటపడటంతో అతను ఎంతమందికి విక్రయించాడనే విషయాలపై టాస్కఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
డ్రగ్స్ వాడిన వారిని పిలిపించి, వారి కుటుంబ సభ్యులు సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే డ్రగ్స్ యూజర్స్ కౌన్సిలింగ్ విషయంలో పోలీసులు గోప్యతను పాటించే అవకాశాలున్నాయి. డ్రగ్స్ విక్రయదారులపై కఠినంగా వ్యవహారిస్తూ డ్రగ్స్ వాడే విద్యార్థులు, యువతను మార్చి సన్మార్గంలోకి తేవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాష్ డ్రగ్స్ సరఫరా చేసిన వారి వివరాలు, వారితో చాటింగ్ చేయడం, డ్రగ్స్ అర్డర్ చేయడం వంటి విషయాలను పోలీసులు సేకరించారు.
డ్రగ్స్ విక్రయాల కోసం స్నాప్ షాట్‌లో ప్రత్యేక గ్రూప్‌ను యాష్ నిర్వహిస్తూ, గోవాకు వెళ్లిన ప్రతి సారి లోకేషన్ షేర్ చేసేవాడు. గోవాలో ఉన్న సమయంలోనే ఎవరికేమి కావాలో అర్డర్ ఇవ్వాలంటూ తన గ్రూప్ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గోవాలో ఉన్నట్లు నిర్ధారణ కాగానే చాలమంది డ్రగ్స్ కోసం అర్డర్ ఇచ్చేవారు. గోవాలో డ్రగ్స్ కొని, వాటిని ఇక్కడ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నాడు. వీసా లేదు..
పాస్‌పోర్టు గడువు పూర్తవుతోంది..! నైజీరియన్ దేశానికి చెందిన డ్రగ్ విక్రేత ఫ్రైడే 2013 మే నెలలో రెండు నెలల కోసం విజిటింగ్ వీసా కోసం వచ్చాడు. అయితే విజిటింగ్ వీసా గడువు పూర్తికాగానే తమ స్వదేశానికి వెళ్లిపోవాలి. ఇతని పాస్‌పోర్టు కూడా ఈ నెల 11వ తేదీతో ముగిసిపోతుంది. వీసా, పాస్‌పోర్టులు లేకుండానే యధేచ్చగా దేశంలో తిరుగుతూ డ్రగ్స్ విక్రయించే దందాను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు.
మరో పక్క కాశ్మీర్ చెందిన టైగర్, ఫ్రైడేలు ఇద్దరు మంచి స్నేహితులు, కలిసి డ్రగ్స్ దందాను మూడేండ్లుగా కొనసాగిస్తున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి : టాస్క్‌ఫోర్స్ డీసీపీ, రాధకిషన్‌రావు కాలేజీలకు వెళ్లే పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టండి. పిల్లలను సంతోష పెట్టేందుకు వారికి కావాల్సిన అవసరాల కంటే ఎక్కువగా సమకూర్చడం వల్ల సోమరులుగా మారడంతో పాటు చెడు అలవాట్లకు ఆకర్షితులయ్యే ప్రమాదముంది. పార్టీల పేరుతో పబ్బులు, దూర ప్రాంతాలకు వెళ్లున్నారంటే అలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచండి.
డ్రగ్స్ కేసులలో పట్టుబడితే పదేళ్ల వరకు శిక్షలు పడుతాయి. యువత విలువైన బంగారు జీవితాన్ని జైలు పాలు చేసుకోవద్దు. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌లో కెమికల్స్‌తో కూడి మత్తు పదార్ధాలుంటాయి, ఇది వాడడం వల్ల శరీర అవయవాలు దెబ్బతింటాయని, ఎల్‌ఎస్‌డీ స్టాంప్‌లో కొంత మేర వాడిని దాని మత్తు 12 గంటల వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి