అరబ్ షేక్ ల చేతుల్లో బందీగా చిక్కుకున్న ఓ తల్లి రోదన

- February 12, 2018 , by Maagulf
అరబ్ షేక్ ల చేతుల్లో బందీగా చిక్కుకున్న ఓ తల్లి రోదన

మస్కట్:సీఎం కేసీఆర్‌ గారు మా అమ్మని చూడాలని ఉంది.. ఇండియాకు రప్పించేలా చూడండి ప్లీజ్‌.. అంటోంది ఓ కూతురు.. భరించలేని కడుపు నొప్పి.. ఇంకో వైపు కడుపునిండా తినలేని స్థితి.. నరకం చూస్తున్నా..   మా ఇంటికి పంపించండి అంటూ అక్కడ ఓ అరబ్ షేక్‌ని అర్థిస్తోంది తల్లి.

అమ్మ ఎలా ఉందో తెలీదు.. ఎప్పుడొస్తుందో అర్థం కాదు.. ఫోన్‌లో తన తల్లి బాధలు విన్న కూతురు అమ్మ కోసం పరితపించిపోతోంది. ఎలాగైనా సరే..  అమ్మను మా ఇంటికి రప్పించండి ప్లీజ్‌ అంటూ సీఎం కేసీఆర్‌ను వేడుకుంటోంది రూపారాణి.. 

ఒక పూట తిండి.. రెండు పూటల పస్తులు ఇది మస్కట్‌లోని ధనలక్ష్మి పరిస్థితి. గుండెపోటు బాధని  గుండెల్లోనే దాచుకుంటూ అరబ్‌ షేక్‌ ఇంట్లో నానా చాకిరీ చేస్తోంది.. భర్త దుర్గాప్రసాద్‌, కొడుకు షణ్ముఖ, కూతురు రూపారాణిలను వదిలి.. వాళ్ల కోసం నాలుగు డబ్బులు సంపాదించాలనే ఆశతో.. పని కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ నరకం అనుభవిస్తోంది... 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో  హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న ధనలక్ష్మికి.. లక్ష్మీ అనే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. దుబాయ్‌ పంపిస్తానని.. అక్కడ కావల్సినంత డబ్బులు సంపాదించొచ్చని ధనలక్ష్మిని లక్ష్మి  నమ్మించింది. భర్త దుర్గాప్రసాద్‌ను, బిడ్డలను ఒప్పించి గతేడాది మస్కట్‌కు వెళ్లింది ధనలక్ష్మి. అక్కడకు వెళ్లిన తరువాత అర్థమైంది ఆమె వచ్చింది మస్కట్‌కు కాదని.. నరకానికి అని.. 

మస్కట్‌కు వెళ్ళగానే ధనలక్ష్మిని ఏంజెంట్‌ శ్రీనివాస్‌ ఓ అరబ్ షేక్ ఇంటికి తీసుకెళ్లాడు.. రెండు సంవత్సరాల పాటు పనికి కుదిర్చి ఆ షేక్‌ దగ్గర లక్షా 40 వేలు అడ్వాన్స్ తీసుకుని జారుకున్నాడు. అడ్వాన్స్‌ సంగతి తెలియని ధనలక్ష్మి.. చాలి చాలని తిండి తింటూ అక్కడే వెట్టిచాకిరీ చేస్తూ వస్తోంది. తిన్నా తినకపోయినా ప్రతి రోజు చాకిరీ చేయడంతో అనారోగ్యం పాలైంది.. దీనికి తోడు చీకటి పడిన తరువాత అరబ్ షేకుల వెకిలి చేష్టలు ధనలక్ష్మికి ప్రత్యక్ష నరకం చూపించాయి. కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లండి బాబు అన్నా పట్టించుకునే వారు లేకపోవడంతో తనలో తానే కుమిలిపోయింది. తనను దుబాయ్‌కు పంపించిన మహిళతో బాధలు చెప్పుకుందామని ప్రయత్నిస్తే.. పంపించడం వరకే తన పని అని.. బాధనంతా గుండెలోనే దాచుకో అంటూ ఊచిత సలహా ఇస్తోంది..

ఇక చేసేది లేక.. అరబ్‌ షేక్‌నే బతిమలాడుకుంది.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లమని.. లేదా ఇండియా పంపించేయాలని ప్రాధేయపడింది. ఏజెంట్ అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బులు చెల్లిస్తే గానీ ఇంటికి పంపించేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో తన గోడును ఫోన్‌ ద్వారా తన భర్తకు  చెప్పి.. కన్నీటి పర్యంతమైంది.

దేశం కాని దేశంలో  నరకయాతన పడుతున్న తన భార్య ధనలక్ష్మిని ఎలాగైనా సరే స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు భర్త దుర్గా ప్రసాద్‌

ఎడారి దేశం నుంచి తాను పడుతున్న కష్టాలను విన్న మాగల్ఫ్ బాధితురాలికి న్యాయం జరగాలి అని కోరుకుంటోంది.. ఏజెంట్‌ మోసానికి గురై దేశంకాని దేశంలో తల్లడిల్లుతున్న ధనలక్ష్మిని వెంటనే ప్రభుత్వం రప్పించే ప్రయత్నం చేయాలని కోరుకుంటోంది. ఇలా ఇలాంటి ధనలక్ష్మిలు ఎంతమంది అరబ్‌షేక్‌ల అరాచకాలకు బలి అవుతున్నారో ఏమో?.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com