అపురూప దృశ్య కావ్యాలు కే. విశ్వనాథ్ చిత్రాలు.. బర్త్‌డే స్పెషల్
- February 19, 2018
సంగీత సాహిత్య సమలంకృతే అని నారాయణరెడ్డి అమ్మవారి గురించి రాశారు గానీ.. నిజానికి ఆ చిత్ర దర్శకుడు విశ్వనాథ్ కూడా సంగీత సాహిత్యాల మేలుకలయికే. తన చిత్రాలకు తనే కథను సమకూర్చుకుంటారు. మాటలు, పాటలు మాత్రం దగ్గరుండి రాయించుకుంటారు. ఆ రాసిన పాటలకు సంగీత దర్శకుడి తో కలసి తనకు నచ్చిన పద్దతిలో స్వరాలు సమకూరుస్తారు. అంతగా మమేకం కావడం వల్లే విశ్వనాథుడు తీసే చిత్రాలు అపురూపంగా రూపొందుతాయి. ఇవాళ విశ్వనాథ్ పుట్టిన రోజు.
విశ్వనాథ్ పుట్టింది రేపల్లె దగ్గరి పెదపులివర్రు. చదువుకున్నది కొంత విజయవాడలో. డిగ్రీ పూర్తి కాగానే...విజయా వాహినీ స్టూడియోలో సౌండ్ విభాగంలో ఉద్యోగం. తండ్రి సుబ్రహ్మణ్యం విజయా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడ కార్యాలయంలో ఉద్యోగి కావడంతో విశ్వనాథ్ ను కూడా అక్కడే ఉద్యోగానికి కుదిర్చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆదుర్తి సుబ్బారావు దగ్గర శిష్యరికం చేశారు.. అన్నపూర్ణ మధుసూదనరావుగారి సాహచర్యం దొరికి ఆత్మగౌరవం చిత్రానికి పూర్తి స్థాయి దర్శకుడయ్యారు విశ్వనాథ్.
ఆదుర్తి సుబ్బారావు సినిమాలకు అధికంగా సంగీతం అందించింది కె.వి.మహదేవన్. అలా అక్కడే విశ్వనాథ్ కి మహదేవన్ తో స్నేహం కల్సింది. మెగాఫోన్ పట్టాక దాదాపు తన చిత్రాలన్నిటికీ మామతోనే సంగీతం చేయించుకున్నారు. ఒకటి రెండు సార్లు రాజేశ్వర్‌రావు విసుక్కున్నా.. విశ్వనాథ్ తన పద్దతి మార్చుకోలేదు. నిజానికి మహదేవన్ , పుహళేంది లేకపోతే విశ్వనాథ్ శంకరాభరణం కల నిజమయ్యేది కాకపోవచ్చంటారు బాలు. అంతటి రాగ బాంధ్యవ్యం వారిద్దరిదీ.
చక్రవర్తి అంటే.. ఓ మాస్ మ్యూజిక్ డైరక్టరు.. మాస్ సాంగ్స్ కు ప్రసిద్ది అనే మాటే వినిపిస్తుందిగానీ...ఆయనా చక్కని సంగీతం అందించిన చిత్రాలున్నాయని...అభిరుచి గల విశ్వనాథ్ లాంటి దర్శకుడు దొరికితే చక్రవర్తి చెలరేగిపోతాడనీ చాలా మందికి తెలీదు. విశ్వనాథ్ డైరక్ట్ చేసిన మూడు సినిమాలకు చక్రవర్తే సంగీత దర్శకుడు. ప్రసిడెంట్ పేరమ్మ కోసం అందరాని చందమామ నాకెందుకు లాంటి పాటలు కూర్చిన చక్రవర్తే...శారదలో వ్రేపల్లె వేచెను అంటూ కొత్త తరహా ట్యూన్ కట్టారు.
ఎనబై దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసు మాస్ అంటూ తేడా లేకుండా సామూహికంగా దర్శక నిర్మాలందరూ...ఇళయరాజా వైపు చూశారు. శంకరాభరణం తర్వాత అనివార్యంగా ఇళయరాజాతో జత కట్టాల్సి వచ్చింది విశ్వనాథ్ కి. ఈ ఇద్దరు సంగీతజ్నుల కాంబినేషన్ లో నాలుగు చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎవరు ఎన్ని చెప్పినా...సాగరసంగమంలో నాద వినోదము పాటే నంబర్ ఒన్.
శంకరాభరణం సినిమానంతరం నిర్మాత నాగేశ్వర్రావుతో కె.వి.మహదేవన్ కు మనస్పర్ధలు రావడంతో ఆయన పూర్ణోదయా తర్వాత చిత్రాలకు పనిచేయలేదు. దాంతో అనివార్యంగా విశ్వనాథ్ ఇళయరాజాతో రెండు చిత్రాలు లాగించేశారు. ఆ తర్వాత స్వయంకృషికి తనకు ఇష్టమైన రమేష్ నాయుడుతో కల్సి పనిచేశారు. చిత్రంగా రమేష్ నాయుడుకు అదే చివరి చిత్రం అయ్యింది.
స్వయంకృషి తర్వాత అదే పూర్ణోదయా బ్యానర్ లో అదే చిరంజీవితో కల్సి సినిమా చేయాల్సి వచ్చింది విశ్వనాధుడికి. ఈ సారి ఆయన మనసు కీరవాణి ని ఎంపిక చేసుకుంది. కీరవాణి కూడా కళాతపస్వి మనసెరిగి...సంగీతం అందించారు. ఆపద్బాంధవుడు పాటలు సూపర్ హిట్. దీంతో శుభసంకల్పం సినిమాకు మరోసారి కీరవాణికే జై కొట్టారు విశ్వనాథ్. బాలు నిర్మాతగా విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దిన శుభసంకల్పంలో హైలెస్సో...పాట కీరవాణి స్వరరచనా ప్రతిభకు నిదర్శనం.
శుభసంకల్పం తర్వాత విశ్వనాథ్ మెగాఫోన్ పక్కన పెట్టి నటనకు పదును పెట్టుకున్నారు. శుభసంకల్పంతో తెలుగు తెరకు ఓ అద్భుతమైన కారక్టర్ ఆర్టిస్టును అందించిన ఘనత మాత్రం బాలసుబ్రహ్మణ్యానికే దక్కుతుంది. నటనను కాసేపు పక్కన పెట్టి తన కోసం వచ్చిన ఓ నిర్మాతకు స్వరాభిషేకం అంటూ తనదైన బాణీలో ఓ చిత్రం చేశారు విశ్వనాథ్. ఆ చిత్రానికి విద్యాసాగర్ తో స్వరాలు అల్లించారు.
మెగాస్టార్ తో చూడాలని ఉంది, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కు పనిచేసిన మణిశర్మ తన బాణీకి భిన్నంగా విశ్వనాథ్ కోసం శుభప్రదం చిత్రం కోసం ఆరోగ్యవంతమైన సంగీతాన్ని అందించారు. మౌనమే చెబుతోంది...పాట వింటుంటే...మణిశర్మ కు విశ్వనాథ్ మీద ఉన్న గౌరవం తెలుస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి