టీ20 సిరీస్‌ శ్రీలంక పర్యటనకు కీలక ఆటగాళ్లు దూరం!

- February 21, 2018 , by Maagulf
టీ20 సిరీస్‌  శ్రీలంక పర్యటనకు కీలక ఆటగాళ్లు దూరం!

శ్రీలంక పర్యటనకు కీలక ఆటగాళ్లు దూరం!

ముంబయి: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం భారత ఆటగాళ్లు బీసీసీఐపై మండిపడ్డారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రతిష్టాత్మక టూర్లకు ముందు జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని నిశ్చయించుకుంది.

ఈ నేపథ్యంలోనే మార్చి 6నుంచి శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్‌కు ప్రస్తుత జట్టులోని పలువురు ఆటగాళ్లను దూరం చేయాలని భావిస్తోంది. కాకపోతే ఎవరెవరికి విశ్రాంతి కల్పించాలన్న దానిపై బీసీసీఐ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. గత ఏడాది డిసెంబరులో లంకతో వరుస సిరీస్‌లు ముగిసిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే కోహ్లీ సేన దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. పది రోజులు విరామం కూడా లేకుండానే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ మొదలెట్టింది. దీంతో అప్పట్లో మాజీ క్రికెటర్లతో పాటు జట్టులోని పలువురు ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరోపక్క దక్షిణాఫ్రికా కూడా భారత్‌తో టీ20 సిరీస్‌ అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడనుందది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశ బోర్డు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది.

ఇప్పుడు ఇదే బాటలో నడవాలని చూస్తోంది బీసీసీఐ. ఎందుకంటే ఏప్రిల్‌లో ఐపీఎల్‌ ప్రారంభంకానుంది.

ఆ తర్వాత భారత్‌.. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు, వెంటనే ఐర్లాండ్‌తో టీ20లు ఆడి ఇంగ్లాండ్‌కు పయనమవ్వనుంది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని భారత్‌ చేరుకునే టీమిండియా స్వల్ప వ్యవధిలోనే శ్రీలంక వెళ్లాల్సి ఉంది. మార్చి 6 నుంచి భారత్‌-శ్రీలంక-బంగ్లాదేశ్‌ మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ జరగనుంది.

ఇంత బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ సఫారీ పర్యటన ముగించుకుని వచ్చిన భారత జట్టులో పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటోంది. వారి స్థానంలో రిషబ్‌ పంత్‌, సంజు శాంసన్‌, మయాంక్‌ అగర్వాల్‌తో పాటు మరికొందరికీ అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఎవరికి విశ్రాంతి దక్కుతుందో.. వారి స్థానంలో ఎవరు చోటు దక్కించుకుంటారో తెలియాలంటే కొద్ది రోజుల వేచి ఉండాల్సిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com