విజయవాడ ఎయిర్ పోర్ట్ కు కొత్త రూపురేఖలు

- February 21, 2018 , by Maagulf
విజయవాడ ఎయిర్ పోర్ట్ కు కొత్త రూపురేఖలు

కృష్ణా : ఆరు దశాబ్దాల చరిత్ర గలిగిన విజయవాడ విమానాశ్రయం సరికొత్త హంగులను సంతరించుకుంటోంది. విమానాశ్రయ రూపురేఖలే మారిపోతున్నాయి. దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌ పోర్టుల కంటే అధికంగా వృద్ధిరేటు సాధిస్తూ.. గణనీయంగా ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. గత ఆర్థిక ఏడాదిలో 8 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది లక్షలాది మంది రాకపోకలు సాగించే దిశగా అధికారులు ప్రాణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ విమానాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి 33 విమాన సర్వీసులు నడుస్తుండగా.. మార్చిలో మరికొన్ని నూతన విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి.

ముంబైకి విమాన సర్వీసు
విజయవాడ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా ఢిల్లీకి మూడవ సర్వీసును ప్రారంభించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబైకి విమాన సర్వీసును ప్రారంభించింది. మార్చి 2 నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైకి ఇండిగో సంస్థ సర్వీసులతోపాటు ట్రూజెట్‌ సంస్థ కడపకు విమాన సర్వీసు ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఇక్కడి నుంచి పలు కీలకమైన దేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు శరవేగంగా చర్యలు చేపట్టింది. దుబాయ్‌, షార్జా, సింగపూర్‌లాంటి దేశాలకు తొలిసారి ఫ్లైట్స్‌ను నడపాలని భావిస్తున్నారు. ఇక ఇండిగో ఢిల్లీ, జైపూర్‌, కోల్‌కతాలాంటి నగరాలకు విమాన సర్వీసులు నడపాలని, గల్ఫ్‌ దేశాలకు విమానాలు ప్రారంభించాలనే యోచన చేస్తున్నాయి.
750మంది ప్రయాణికుల 
అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం పాత టెర్మినల్‌ను ఆధునీకరించి .. అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించనున్నారు. ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌ 750మంది ప్రయాణికుల రాకపోకలకు ఒకేసారి అవకాశం కల్పించనున్నారు. గత కొంతకాలంగా ఎయిర్‌పోర్టు సాధిస్తున్న ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణానికి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో స్టుప్‌ అనే సంస్థను కేంద్రం ఎంపిక చేసింది. టెర్మినల్‌ బిల్డింగ్‌ వ్యవహారాలన్నీ ఈ సంస్థ పర్యవేక్షణలో కొనసాగుతాయి. అంతేకాదు.. డిజైన్స్‌ అన్నింటినీ ఈ సంస్థే రూపొందిస్తుంది. ఇలా విజయవాడ విమానాశ్రయానికి నూతన హంగులు రూపుదాల్చనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com