పంజాబ్‌ ఎప్పటికీ కలిసే ఉంటుంది - కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో

- February 21, 2018 , by Maagulf
పంజాబ్‌ ఎప్పటికీ కలిసే ఉంటుంది - కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో

ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందన్నారు కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడో. ఖలిస్థాన్‌ ఉద్యమానికి ఊతమిచ్చేది లేదని స్పష్టం చేశారు. పంజాబ్‌ ఎప్పటికీ కలిసే ఉంటుందని... ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని భరోసా ఇచ్చారు. కుటుంబంతో కలిసి పంజాబ్‌లో పర్యటించిన ట్రూడో... స్వర్ణదేవాలయంలో చపాతీలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

భారత్‌ టూర్‌లో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో... కుటుంబంతో కలిసి పంజాబ్‌లో పర్యటించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. సామూహిక వంటశాలలో జరిగిన సేవలో పాల్గొన్నారు. మొక్కులో భాగంగా తన భార్యతో కలిసి చపాతీలు చేశారు. భార్యా పిల్లలతో కలిసి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ట్రూడో. స్వర్ణ దేవాలయం చాలా అందమైన ప్రదేశమంటూ కితాబిచ్చారు.

పంజాబ్‌ పర్యటనలో ఉన్న ట్రూడోతో... సీఎం అమరీందర్‌సింగ్‌ సమావేశమయ్యారు. కెనడాలో పెద్దసంఖ్యలో సిక్కు జనాభా ఉండటం.. ఖలిస్థాన్‌ వేర్పాటువాద ఉద్యమానికి కొందరు కెనడా మంత్రులు మద్దతునిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందని ట్రూడో అన్నారు. విభజన ఉద్యమాలకు మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఖలిస్థాన్‌ డిమాండ్‌ తగ్గుముఖం పట్టేందుకు తనవంతు కృష్టి చేస్తానంటూ సీఎం అమరీందర్‌సింగ్‌కు ట్రూడో హామీ ఇచ్చారు. పంజాబ్‌ ఎప్పటికీ కలిసే ఉంటుందని... ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని భరోసా ఇచ్చారు.

పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు సహకరించొద్దని ట్రూడోను కోరినట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ తెలిపారు. తమకు ఐక్య పంజాబ్‌ కావాలని.. ఖలిస్థాన్‌ డిమాండ్‌ తగ్గుముఖం పట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు ట్రూడో సానుకూలంగా స్పందించారని చెప్పారు. భారత పర్యటనలో ఉన్న ట్రూడో ఈనెల 23న ప్రధాని నరేంద్రమోడీని కలుసుకొని తన పర్యటన ముగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com