మార్చి 4 నుంచి వైవిద్యభరితం... మంచ్ మహోత్సవం

- February 27, 2018 , by Maagulf
మార్చి 4 నుంచి వైవిద్యభరితం... మంచ్ మహోత్సవం

హైదరాబాద్: టీవీలు, సినిమాలు, సెల్‌ఫోన్‌లు ఎన్ని వచ్చినా.. నాటకం మాత్రం తనదైన స్థానాన్ని పదిలపరుచుకుంటూనే ఉంది. పౌరాణికం నుంచి ఆధునికం వరకు నిత్య నూతనంగా ప్రేక్షకుల మది దోచుకుంటున్న కళారూప నాటకం. సామాజిక జీవితానికి అత్యద్భుతంగా ప్రదర్శించిన కళాకారులెందరో ఉన్నారు. అందుకే నాటకం నేటికీ సజీవంగా ఉంది. నగరవాసులకూ నాటకంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ.. మంచ్ థియేటర్ వైవిద్యభరిత నాటకాలతో ముందుకు వస్తున్నది. మార్చి 4వ తేదీ నుంచి మంచ్ మహోత్సవం పేరుతో నగరవాసులకు హాస్యాన్ని పంచనున్నది. నాటకం.. కేవలం వినోదం మాత్రమే కాదు.. అది సామాజిక జీవితానికి ప్రతిబింబం. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలోనూ నాటకం కీలక పాత్ర పోషిస్తున్నది. కొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తున్నది. వాస్తవాల్ని ప్రజలముందుంచుతున్నది. వందల ఏండ్లుగా నాటకం అలాంటి పాత్ర పోషిస్తున్నది. నేటి తరం నాటక సమాజం ఆ ఒరవడిని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తున్నది. అందులో భాగంగా నగరానికి చెందిన మంచ్ థియేటర్ మంచ్ మహోత్సవం పేరుతో నాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నది. మార్చి 4, 10, 24, ఏప్రిల్ 1 తేదీల్లో అలాంటి నగరవాసుల కోసం అద్భుతమైన నాటకాలను ప్రదర్శించనున్నది. అందుకు అపోలో ఫౌండేషన్ థియేటర్ వేదిక కానున్నది. వైవిద్యభరితం... మంచ్ మహోత్సవంలో భాగంగా వైవిద్యభరితమైన ఎనిమిది నాటకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు శ్రీకాంత్ తెలిపారు. దైనందిన జీవితంలో స్త్రీలు ఎదుర్కొనే పరిస్థితులను కళ్లకుకట్టే స్ఫూర్తి, పిల్లల భవిష్యత్ కోసం తపన పడే ఓ తల్లి కథను చెప్పే భవిత వంటి నాటకాలను ప్రదర్శించనున్నామని తెలిపారు. ఓ ప్రేమ... ఓ దొంగ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని, డిప్పమ్ నాటిక మనుషుల ఆలోచనా సరళిని పట్టిస్తుందని తెలిపారు. మనిషి అవకాశ వాదాన్ని సత్యం నాటకంలో అర్థం చేసుకోవచ్చని, దేశ భవిష్యత్ గురించి అడుగు నాటకంలో చూడవచ్చన్నారు. స్త్రీలపై జరిగే ఆకృత్యాలను గురించి అ.. అంటే నాటకంలో, రాజరికాన్ని గురించి గార్థభాండం నాటకంలో చూడవచ్చన్నారు. ఈ అవకాశాన్ని నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com