ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు దేవరాజు రవి కన్నుమూత

- March 02, 2018 , by Maagulf
ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు దేవరాజు రవి కన్నుమూత

ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినీ సమీక్షకుడు దేవరాజు రవి(79) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మేడిపల్లిలోని నివాసంలో కన్ను మూశారు. దేవరాజు రవి 12 నవలలు, 200 పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ రాశారు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవల 'వాడే వీడు' రచయిత అయిన దేవరాజు వెంకట కృష్ణారావు కుమారుడైన రవి.. 1959లో రామం అనే నవలను రచించారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. దేవరాజు రవి మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఆయన చేసిన సమీక్షలు సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి.

దేవరాజు రచనలను సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి. గిరి వంటి ప్రముఖులు మెచ్చుకున్నారు. నంది అవార్డుల కమిటీలో దేవరాజు రెండుసార్లు సభ్యుడిగా ఉన్నారు. రవి స్వస్థలం బరంపురం. దేవరాజు రవి సుప్రసిద్ధ సాంఘిక కార్యకర్త. కుష్టువ్యాధి నిర్మూలనకు విశేషంగా కృషిచేశారు. ఎంతోమంది రోగులకు స్వయంగా సేవ చేశారు. లెప్రసీ డాక్టర్‌గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవి విరమణ అనంతరం కూడా ఆ సేవల్ని కొనసాగించారు. దేవరాజు రవి అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com