'అన్నదాతా సుఖీభవ'

- March 04, 2018 , by Maagulf
'అన్నదాతా సుఖీభవ'

సామాజిక.. ఇతివృత్తాలతో చిత్రాలను తెరకెక్కించే ఆర్‌.నారాయణమూర్తి ఈసారి గిట్టుబాటు ధర దొరకని కారణంగా ఆత్మహత్యలకి పాల్పడుతోన్న రైతుల వ్యథతో 'అన్నదాతా సుఖీభవ' చిత్రాన్ని తనే నటిస్తూ స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఇది స్నేహచిత్ర పతాకంపై ఆయన తెరకెక్కిస్తున్న 30వ చిత్రం. విడుదలకి సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఆర్‌.నారాయణమూర్తి విలేకర్లతో మాట్లాడారు. ''రైతే రాజు అన్నది ఒకప్పటి మాట. ఇప్పటిది కాదు. ఈనాడు పరిస్థితిని చూస్తుంటే రైతు బికారి అనిపిస్తోంది. వాస్తవానికి పొద్దు తనని తాకకముందే శిలువలా నాగల్ని మోసుకువెళ్లే కరుణామయుడు..రైతు. ఇదే మా సినిమా నినాదం. అసలు రైతే అన్నదాత. కానీ ఆ అన్నదాత సుఖంగా లేడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 1995 నుంచి ఇప్పటిదాకా మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పదేళ్ల కిందట డా।। స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారంగా ఏ ప్రభుత్వాలూ రైతులకి గిట్టుబాటు ధరల్ని అందించేలా కృషి చేయలేదు. నిరాటంకంగా రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి ఈవేళ రైతు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందినవాడు. ఈనాడున్న పరిస్థితుల రీత్యా కొందరు వ్యవసాయం దండగ అనుకుంటున్నారు. ఈ మాటలో నిజం లేదు. వ్యవసాయం దండగ కాదు పండగ అని మా చిత్రం ద్వారా రుజువు చేసే ప్రయత్నంలో భాగమే ఈ సినిమా. ఇందులో ఎనిమిది పాటలున్నాయి. ప్రజాకవులు రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అమోఘం. గద్దర్‌, వందేమాతరం శ్రీనివాస్‌తోపాటు యువగాయకుడు పవన్‌ చరణ్‌ పాడిన రెండు పాటలు ఆకట్టుకుంటాయి. మరో మూడు రోజుల్లో సెన్సారును పూర్తిచేసుకుని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం''అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com