తెలుగు ఎంపీల నిరసనతో హోరెత్తిన లోక్ సభ, రాజ్య సభలు
- March 05, 2018
విభజన హామీల అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో తెలుగు ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఉభయ సభల్లో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో పదే పదే సభలు వాయిదా పడుతూ వచ్చినా.. ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. మరి ఎంపీలు ఇవాళేం ఆందోళన కార్యక్రమాలు చేపడతారన్నది ఉత్కంఠగా మారింది.
మళ్లీ మళ్లీ అవే సీన్లు.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఒకటే గందరగోళం.. విభజన హామీల అమలు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం.. పార్లమెంట్‌ను కుదిపేశాయి. బడ్జెట్ తొలి సెషన్లో ఏపీ ఎంపీలు మాత్రమే ఆందోళనలు చేస్తే.. మలివిడత సెషన్లో ఏపీ ఎంపీలకు టీఆర్ఎస్ ఎంపీలు గొంతు కలిపారు.. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.. సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు.. దీంతో తొలిరోజు రెండు సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా వాయిదా పడ్డాయి..
లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన సభ్యులకు నివాళులర్పించారు. తరువాత స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఏపీ ఎంపీలు ఆందోళన చేయడంతో స్పీకర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సభను గంట పాటు వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. ముఖ్యంగా రిజర్వేషన్లకు సబంధించిన అధికారాలను కేంద్రం దగ్గరే ఉంచుకుంటే ఎలా అని టీఆర్ఎస్ నేతలు మండి పడ్డారు..
మరోవైపు ఏపీకి న్యాయం చేయాలంటూ టీడీపీ ఎంపీలు లోక్‌సభను స్తంభింపచేశారు. వాయిదా తరువాత తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. విభజన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చూస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు..
ఇటు రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. విభజన హామీలపై చర్చించాలని పట్టుబట్టారు. ప్లకార్డులతో నిరసనకు దిగడంతో చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన పెద్దల సభలో రగడ సర్దుమణగలేదు. ఏపీ ఎంపీలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభను చైర్మన్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.. సభ తిరిగి ప్రారంభమైన తరువాత నినాదాలు తీవ్రత పెరిగింది.
ఏపీకి న్యాయం చేయాలని.. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ ఎంపీలు.. రాష్ట్రానికి అధికారాలు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఎంపీలు వెనక్కు తగ్గలేదు.. దీంతో రాజ్యసభ కూడా.. మంగళవారానికి వాయిదా పడింది..
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







