మోడీకి మరో గట్టి షాకిచ్చిన చంద్రబాబు నాయుడు

- March 16, 2018 , by Maagulf
మోడీకి మరో గట్టి షాకిచ్చిన చంద్రబాబు నాయుడు

మోడీకి మరో గట్టి షాకిచ్చారు చంద్రబాబు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చేసింది. ఆ పార్టీ ఎంపీలు ఏకంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీస్‌ ఇచ్చారు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్ అయింది. మోడీ ప్రభుత్వంపై విపక్షాలకు పీకలదాకా కోపం ఉన్నా.. ఏ ఒక్క పార్టీ కూడా అవిశ్వాసం ఊసెత్తలేదు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చే సరికి విపక్షాలు అలర్టయ్యాయి. ముఖ్యంగా జాతీయ నాయకులతో చంద్రబాబు పరిచయాలు టీడీపీకి పనికొస్తున్నాయి. ఏకంగా వంద మంది ఎంపీల బలాన్ని ఆయన కూడగట్టారు.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుంటే.. ఢిల్లీలో లాలూచీ రాజకీయాలు నడుస్తున్నాయని చంద్రబాబు నిన్న అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వాళ్లను రేపు, ఎల్లుండి కడిగేస్తానంటూ హెచ్చరించారు. ఆ వెంటనే.. రాత్రి పలు పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపారాయన. తమ పార్టీ కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెడితే.. మద్దతివ్వాలని కోరారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన వెంటనే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించారు. అవిశ్వాసం నోటీస్‌కు సైతం తమ పార్టీ మద్దతిస్తుందని ఆమె స్పష్టంచేశారు. లోక్‌సభలో తృణమూల్‌కు 34 మంది సభ్యులున్నారు.

కేంద్రంపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం నోటీస్‌కు కాంగ్రెస్‌ సైతం జై కొట్టింది. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు 48 మంది సభ్యులున్నారు. ఏకపక్ష విధానాలతో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోడీ వెళ్తున్నారంటూ ఇప్పటికే ఆ పార్టీ విందు రాజకీయాలు నడుపుతోంది. ఇప్పుడు అవిశ్వాసం రూపంలో అందివచ్చిన అవకాశాన్ని క్యాష్‌ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎక్కువ మంది మద్దతు కూడగట్టేందుకు ఇతర పార్టీల నాయకులతోను సంప్రదింపులు జరుపుతున్నారు.

పార్లమెంట్‌లో బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ మంది సభ్యులే ఉన్నారు. NDAను పరిగణలోకి తీసుకుంటే.. బ్రహ్మాండమైన మెజార్టీ ఉండేది. ఇప్పుడా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కమలనాథుల నుంచి మిత్రులు దూరమవుతున్న పరిస్థితి. భవిష్యత్‌లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదంటూ శివసేన గతంలోనే ప్రకటించింది. దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నా.. ఎన్డీఏలోనే కొనసాగుతోంది. నిన్నటివరకు కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ బయటకెళ్లి.. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో శివసేన స్టెప్‌ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఆ పార్టీకి లోక్‌సభలో 18 మంది ఎంపీలున్నారు. నలుగురు సభ్యులున్న మరో మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ తటస్థ వైఖరి ప్రదర్శిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com