భద్రాద్రిలో కోదండరాముని కల్యాణోత్సవాలు...

- March 24, 2018 , by Maagulf
భద్రాద్రిలో కోదండరాముని కల్యాణోత్సవాలు...

కోదండరాముడు కల్యాణానికి సిద్ధమయ్యాడు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని కల్యాణోత్సవం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లలమామిడాడ కోదండ రామాలయంలో కన్నుల పండువగా కల్యాణం జరగబోతోంది.

విమాన గోపురం.. దానిపై పురాణగాధలను తెలియజేసే బొమ్మలు.. మయసభను తలపించే అద్దాల మందిరం.. ఎంతో చరిత్ర కలిగిన ఆలయం గొల్లలమామిడాడ కోదండరామాలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మామూలు రోజుల్లో పర్యాటకులను ఆకర్షించే ఈ ఆలయంలో.. శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరగనుంది. ఐదు రోజుల పాటు రాముని కల్యాణోత్సవాలు జరుగుతాయి. 26న కల్యాణం జరగనుంది. 

గొల్లలమామిడాడ కోదండరాముని కల్యాణోత్సవాన్ని చూడడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. 1889లో ద్వారంపూడి వంశానికి చెందిన రెడ్డి సోదరులు.. రామలక్ష్మణుల కర్రబొమ్మలను ప్రతిష్టించి పూజలు  చేసేవారు. అప్పటి నుంచి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు భక్తులు. మహాభారతం, భాగవతం, ఇతిహాసాలను తెలియజేసే బొమ్మలు భక్తులకు పురాణగాధను కళ్లకు కడతాయి. 

కోరినవారికి కొంగు బంగారంగా నిలిచే కోదండరాముడ్ని కల్యాణ మహోత్సవాలు కన్నులారా చూడడాన్ని ఆనందంగా భావిస్తారు. ముత్యాల తలంబ్రాలు, వెండి తలంబ్రాలతో స్వామివారికి కల్యాణం చేస్తారు. కల్యాణానంతరం పూర్ణాహుతి, కనక విసర్జన కార్యక్రమాలతో పాటు అద్దాల శయనమందిరంలో స్వామివారిని ఊయలూగిస్తారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com