సిరియాలో మరో నరమేధం.. 37 మంది సజీవ దహనం

- March 24, 2018 , by Maagulf
సిరియాలో మరో నరమేధం.. 37 మంది సజీవ దహనం

సిరియా:సిరియాలో ప్రభుత్వ బలగాలు, ఉగ్రవాదుల మధ్య పోరు మరోసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉగ్రవాద శక్తుల అణచివేత చర్యల్లో భాగంగా రష్యన్‌ దళాలు తూర్పు ఘౌటాలో చేసిన బాంబు దాడిలో బంకర్‌ పేలి 37 మంది సాధారణ పౌరులు దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. చెల్లాచెదురైన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలిలోని దృశ్యాలు హృదయవిదారకరంగా ఉంది. 

ఘటనకు సంబంధించిన ఫోటోలను ‘సిరియా పౌర రక్షణ దళం’ మీడియాకు విడుదల చేసింది. కొంత మంది సాధారణ పౌరులు కలసి ఈ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాంబు దాడి వార్త తెలిసిన వెంటనే పౌర రక్షణ దళం సభ్యులు హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

నిషేధిత వైట్‌ ఫాస్పరస్‌ బాంబును ఈ దాడిలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. పూర్తిగా తగలబడిపోయిన శరీరాలు, ముక్కలుగా ఎగిరిపడ్డ శరీర భాగాలతో కనిపిస్తున్న ఫొటోలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ విషాద దృశ్యాలు సిరియాలో నరమేధం ఏ స్థాయిలో ఉందో ప్రపంచానికి మరోసారి చాటుతున్నాయి.

మరోవైపు.. తూర్పు ఘౌటా ఘటనపై రష్యా వివరణ ఇచ్చింది. ఈ దాడిలో తమ భద్రతా దళాల ప్రమేయం లేదని చెప్పింది. 2011లో సిరియా అంతర్యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ 3,50,000 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి అంత కంటే అధిక సంఖ్యలో ప్రజలు మరణించారని పౌర హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com