మే 12న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు

- March 26, 2018 , by Maagulf
మే 12న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి వెంటనే అమలులోకి వస్తుందని ఈసీ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. కర్నాటక ఎన్నికలు కేవలం ఒకే దశలో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 15వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 17న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు నామినేషన్ ఫైలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 27న ఉపసంహరణ ఉంటుంది. ఈసారి మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 450 పోలింగ్ స్టేషన్లను మహిళలే నిర్వహిస్తారని ఈసీ పేర్కొన్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను అన్ని పోలింగ్ సెంటర్లలోనూ వాడనున్నారు. ఈవీఎంలకు అభ్యర్థుల ఫోటోలను అంటించనున్నారు. దీంతో ఓటర్లు అభ్యర్థి అయోమయం చెందకుండా ఉంటుంది. కర్నాటకలో 72 శాతం జనాభా.. ఓటింగ్‌కు అర్హత ఉన్నది. ఆ రాష్ట్రంలో 4.96 కోట్ల ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ కనీస సౌకర్యాలు కల్పించనున్నట్లు ఈసీ పేర్కొన్నది. ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ మే 28వ తేదీన ముగియనున్నది. 2013లో కర్నాటక ఎన్నికల్లో 71.45 శాతం ఓటింగ్ జరిగింది. సీఆర్‌పీఎఫ్ దళాలను కూడా ఎన్నికల కోసం మోహరించనున్నారు. రెగ్యులర్‌గా ఈసీ ఆ దళాలను మానిటర్ చేయనున్నది. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు బలహీన వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించనున్నారు. రాజకీయా పార్టీలకు 28 లక్షల సీలింగ్ విధించారు. పోలింగ్ బూత్ ఖర్చులను కూడా అభ్యర్థుల ఖర్చులోనూ జమ చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఘటనలు ఏమైనా ఉంటే వాటిని హైలైట్ చేయాలని ఈసీ మీడియాను కోరింది. అయితే ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించకముందే.. తేదీల వివరాలు వెల్లడి కావడం పట్ల ఎన్నికల సంఘం కార్యాలయంలో దుమారం చెలరేగింది. అధికారిక ప్రకటన కంటే ముందుగానే కొన్ని మీడియా సంస్థలు తేదీలను ప్రకటించాయి. దీంతో ఈసీ ఆఫీసులో గందరగోళం నెలకొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com