పాక్‌లో భారత్‌ హీరో డాక్యుమెంట్ల ప్రదర్శన

- March 27, 2018 , by Maagulf
పాక్‌లో భారత్‌ హీరో డాక్యుమెంట్ల ప్రదర్శన

లాహోర్‌, పాకిస్తాన్‌ : భారత జాతి బానిస సంకెళ్లు తెంచేందుకు బ్రిటిష్‌ పాలకులకు ఎదురు తిరిగి పిన్నవయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌. ఆయనను ఉరి తీసి 87 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ మహా వీరుడ్ని స్మరించుకుంటూ.. పాక్‌ ప్రభుత్వం అతనికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచింది. సోమవారం లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్ద ఉన్న పంజాబ్‌ రాష్ట్ర ఆర్కైవ్స్‌ విభాగంలో డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచారు.

వీటిలో భగత్‌ సింగ్‌కు ఉరి శిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, ఆయన చదివిన పుస్తకాలు, జైల్లో ఉన్నప్పుడు వార్తపత్రికల కోసం భగత్‌ సింగ్‌ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడి ఉరిశిక్షను రద్దు చేయాలంటూ భగత్‌ సింగ్‌ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌, ఉరి శిక్షను అమలు చేసినట్లు లాహోర్‌ జైలు సూపరింటెండెంట్‌ సంతకంతో ఉన్న పత్రం(భగత్‌ సింగ్‌ను మార్చి 23, 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసింది). జైలు నుంచి భగత్‌సింగ్‌ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్‌ సింగ్‌ అడ్మిషన్‌ పొందిన రికార్డులు మొదలైనవి ప్రదర్శనకు ఉంచారు.

అయితే, ఈ ప్రదర్శనను నిర్వహించాలని పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్‌ సయీద్‌ అధ్యక్షతన జరిగింది. భగత్‌ సింగ్‌ భారత్‌-పాక్‌ రెండు దేశాలకు చెందిన హీరో అని, బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఆ వీరుడు సాగించిన పోరాటాలు ఇరు దేశాల ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచినట్టు పాకిస్తాన్‌ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com