మనసుకు హత్తుకునే కవితతో కోడలికి ఆహ్వానం పలికిన అంబానీలు

- March 30, 2018 , by Maagulf
మనసుకు హత్తుకునే కవితతో కోడలికి ఆహ్వానం పలికిన అంబానీలు

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగబోతున్నాయి. ముఖేష్‌ పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ, ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త రస్సెల్‌ మెహతా కూతురు శ్లోక మెహతా వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య మార్చి 24న గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే అంబానీ కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్న శ్లోక మెహతకు నీతా అంబానీ, ఇషా అంబానీ ప్రత్యేక రీతిలో ఆహ్వానం పలికారు. కాబోయే వధూవరులను ఉద్దేశిస్తూ.. వారి అపురూపమైన ప్రేమను తెలుపుతూ నీతా అంబానీ ఏకంగా ఓ పద్యమే రాశారు. 

‘ఏబీసీడీలు చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లారు. అప్పట్లో వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలీదు. చిన్నప్పుడు వారు తిన్న జెల్లీ బీన్స్‌, చాకొలెట్స్‌ వారి జీవితాలను మధురంగా మార్చాయి. చిన్నప్పుడు వేసుకున్న పోనీటెయిల్స్‌, ఆడుకున్న బార్బీ బొమ్మలు, చిన్న చిన్న గొడవలు..ఇవన్నీ జరిగి ఏళ్లు గడిచిపోయాయి. ఈరోజు ఇద్దరూ పెద్దవారయ్యారు. వారికళ్లలో ప్రేమ దాగి ఉంది. ఇద్దరి హృదయాలు ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అన్న ఒక్క మాటే కోరుకుంటున్నాయి. వారిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడూ ఒకరికొకరు ఇలా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ నీతా ఈ పద్యాన్ని రాశారు.

అటు ఇషా అంబానీ కూడా ఆకాశ్‌-శ్లోక ఎంగేజ్‌మెంట్‌ రోజు హృదయాన్ని హత్తుకునే మెసేజ్‌ను తన వదినకు అందించారు. ‘ఈ రోజు మొత్తం హృదయాలకు సంబంధించింది. శ్లోకా ఓ హృదయం, ఆకాశం ఓ హృదయం. హృదయాలకు సంబంధించిన వేడుక. నేను, అనంత్‌ మీ వివాహం జరగబోతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు కలిగినంత సంతోషం ఇదివరకెప్పుడూ కలగలేదనుకుంటా. వదిన రూపంలో నాకు సోదరి దొరుకుతోంది. శ్లోకను వదిన అని పిలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్లోక నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె సోదరి దియా నేను కలిసే చదువుకున్నాం. తల్లులు వేరైనా.. నేను, శ్లోక, దియా అక్కాచెల్లెళ్లలా ఉంటాం. శ్లోక మా ఇంట్లోకి వస్తున్న సందర్భంగా మా కుటుంబం పరిపూర్ణం అయినట్లుగా ఉంది’ అని ఇషా అంబానీ అన్నారు. నీతా అంబానీ, ఇషా అంబానీ శ్లోకా మెహతాను అంబానీ కుటుంబంలోకి ఆహ్వానించిన తీరు ఆకట్టుకుటోంది. డిసెంబర్‌లో ముంబైలో శ్లోక, ఆకాశ్‌ల వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com