సిరియా సమస్యపై నడుం బిగించిన దేశాలు

- April 04, 2018 , by Maagulf
సిరియా సమస్యపై నడుం బిగించిన దేశాలు

అంకారా: సిరియన్ల సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా కృషి చేయనున్నట్టు రష్యా, టీర్కీ, ఇరాన్‌ దేశాధ్యక్షులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తామని రష్యా, టర్కీ, ఇరాన్‌ అధ్యక్షులు పుతిన్‌, ఎర్డోగన్‌, రౌహానీ వెల్లడించారు. టర్కీ రాజధాని అంకారాలో సదస్సు ముగిసిన అనంతరం మూడు దేశాలకు చెందిన అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. సిరియన్ల సమస్యలపై గతంలో రష్యాలోని సోచీ నగరంలో, కజక్‌ రాజధాని అస్తానాలో చర్చలు నిర్వహించామని అన్నారు. గతేడాది నవంబర్‌ నుంచి టర్కీ, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతున్నాయి. టర్కీకి ఎస్‌-400 యుద్ధ విమానాలు సరఫరా చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. సిరియన్ల సమస్యలపై పరిష్కారానికి రష్యా,టర్కీ, ఇరాన్‌ దేశాలు ముందుకు రావడం శుభపరిణామని ఇస్తాంబుల్‌లోని కుల్తూర్‌ వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల శాఖ ప్రతినిధి మెన్సుర్‌ అక్‌గన్‌ తెలిపారు. సిరియాలో 2011లో అంతర్యుద్ధం చెలరేగింది. సిరియాలో బ్రిటన్‌కు చెందిన హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం....సిరియా ఆర్మీ, మిలిటెంట్ల మధ్య ఏడేండ్ల నుంచి జరుగుతున్న పోరులో మూడున్నర లక్షల మంది మృతి చెందారు. లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. తుపాకుల మోతతో, ఫిరంగుల చప్పుళ్లతో సిరియన్లు కంటిమీద కునుకులేకుండా భీతిల్లుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉగ్రవాదుల బారి నుంచి తమ ప్రజలను రక్షించాలని సిరియా అధ్యక్షుడు అసద్‌ పుతిన్‌ను అభ్యర్థించారు. అయితే, ఈ ప్రాంతంలో సిరియా, రష్యా బలగాలు నిర్వహించిన ఉమ్మడి ఆపరేషన్‌ కారణంగా వేలాది మంది మిలిటెంట్లు హతమయ్యారు. మరి కొంతమంది సిరియా సరిహద్దు ద్వారా ఇతర ప్రాంతాలకు పలాయనమయ్యారు. 
అయితే, సిరియాలోని అనేక నగరాలు ఇంకనూ ఉగ్రవాదుల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ప్రాణభయంతో జీవిస్తున్నారు. ఉగ్రవాదుల బారి నుంచి సిరియన్లను రక్షిస్తామని సిరియా, టర్కీ, ఇరాన్‌ దేశాలు ప్రతిన బూనాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com