సిరియా పై రసాయన దాడి..70 మంది మృతి

- April 07, 2018 , by Maagulf

సిరియాలోని తూర్పు ఘూటాలో జరిగిన అనుమానిత విషవాయువు దాడిలో 70 మంది ప్రజలు మరణించి ఉంటారని స్థానికులు, అధికారులు తెలిపారు. తిరుగుబాటుదార్ల ఆధీనంలోని చివరి నగరం దూమాపై రసాయన దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థ 'వైట్ హెల్మెట్' ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. దాడికి గురైన ఓ బేస్‌మెంట్‌లో గుట్టలుగా పడివున్న మృతుల ఊహాచిత్రాలను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
అనంతరం, ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి, మృతుల సంఖ్య 150 అని మరో ట్వీట్ చేసింది. 
మరోవైపు.. విష వాయువు దాడి ఆరోపణలను సిరియా ప్రభుత్వం ఖండించింది. ఇదంతా కట్టు కథ అంటూ కొట్టిపారేసింది.
 
అయితే.. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, విషరసాయన దాడి వాస్తవమైతే.. సిరియా ప్రభుత్వానికి మద్దతిస్తున్న రష్యా ఈ ఘటనకు బాధ్యత వహించాలని అమెరికా పేర్కోంది. ''విషరసాయనాల వాడకం రష్యాకు కొత్తేమీకాదు..! ఇప్పుడు సిరియాలో విష రసాయనాలను ప్రయోగించి, అనేకమంది ప్రజలను పొట్టనపెట్టుకుంది. ఇందుకు రష్యా తప్పక బాధ్యత వహించాలి'' అంటూ అమెరికా ఘాటుగా స్పందించింది.

తిరుగుబాటుదార్లకు మద్దతు తెలుపుతున్న మీడియా కూడా ట్విటర్‌లో స్పందించింది. ఈ రసాయనదాడిలో దాదాపు వెయ్యి మందికిపైగా సిరియన్లు దుష్ప్రభావానికి లోనయ్యారని పేర్కొంది. గగనతల దాడిలో భాగంగా.. హెలీకాప్టర్ నుంచి ఓ బ్యారెల్‌ను కిందకు జారవిడిచారని, అందులో విషపూరిత 'సారిన్' రసాయనం ఉందని స్థానిక మీడియా ఆరోపించింది. ఇంతవరకూ తిరుగుబాటుదార్ల ఆధీనంలోని దూమా నగరాన్ని.. సిరియా ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com