రన్‌వే మూసివేత.. 225 విమానాలు రద్దు

- April 09, 2018 , by Maagulf
రన్‌వే మూసివేత.. 225 విమానాలు రద్దు

ముంబయి: రుతుపవనాల ముందు చేపట్టే నిర్వహణ పనుల కారణంగా ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వేను 6 గంటల పాటు మూసివేయడంతో సోమవారం 225కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 70 విమానాల వేళలు మార్చారు. ప్రధానంగా జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ ఇండియా , ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయర్‌, విస్టారా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంఐఏఎల్‌) నిర్వహిస్తున్న ఈ రన్‌వేను సోమ, మంగళవారాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ 54 దేశీయ సర్వీసులు సహా మొత్తం 70 విమానాలను రద్దు చేసింది. మరో 70 విమానాల వేళల్లో మార్పులు చేసింది. ఎయిర్‌ ఇండియా 34 విమానాలను నడపరాదని ముందే నిర్ణయించింది. ఈమేరకు ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం కూడా అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయమైన ఇక్కడ 09/27 (ప్రధాన), 14/32 (రెండో) రన్‌వేలున్నాయి. ఇందులో ప్రధాన రన్‌వేపై గంటకు 48 విమానాల రాకపోకలకు వీలుండగా.. రెండోది 35 విమానాల రాకపోకల సామర్ధ్యంతో ఉంది. ప్రతిరోజూ ఈ విమానాశ్రయానికి సగటున 970 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com