రైజింగ్ 'శిఖరం': హైద్రాబాద్ సూపర్ హిట్
- April 09, 2018
టీమిండియాకైనా, సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టుకైనా.. శిఖరం లాంటోడు శిఖర్ ధావన్ (Sikhar Dhawan). ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. మైదానంలో చెలరేగిపోయాడంటే, ప్రత్యర్థి బౌలర్ బెంబేలెత్తాల్సిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ (Indian Premiere League 11)11లో భాగంగా సన్ రైజర్స్ తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. దాంతో, టోర్నీలోకి సగర్వంగా అడుగుపెట్టినట్లయ్యింది సన్ రైజర్స్ హైద్రాబాద్ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ కేవలం 125 పరుగులకే చాప చుట్టేసిందంటే, దానిక్కారణం సన్ రైజర్స్ బౌలింగ్. బౌలింగ్‌లో మాత్రమే కాదు, ఫీల్డింగ్‌లోనూ సన్ రైజర్స్ సత్తా చాటింది. మెరుపు ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించిన సన్ రైజర్స్, బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది.
126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌కి ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ సాహా (Saha) (5) వికెట్‌ని కోల్పోయాక, సన్ రైజర్స్ మరో ఛాన్స్ ఇవ్వలేదు రాజస్తాన్ రాయల్స్ జట్టుకి. ముఖ్యంగా శిఖర్ ధావన్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఓ 13 బౌండరీలతోపాటు ఓ భారీ సిక్సర్ కూడా నమోదు చేశాడు. ఈ క్రమంలో రాజస్తాన్ బౌలర్స్ చేతులెత్తేయడం మినహా ఏమీ చేయలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 36 పరుగులు చేసి ధావన్‌కి అండగా నిలిచాడు. కేవలం 15.5 ఓవర్లలోనే సన్ రైజర్స్ (Sun Risers Hyderabad) విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థిని తక్కువ పరుగులకే ఔట్ చేయడం, 15.5 ఓవర్లకే కేవలం 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించడంతో సన్ రైజర్స్ జట్టు నెట్ రన్‌రేట్ పరంగా టాప్ ప్లేస్‌లోకి చేరుకోవడం గమనార్హం.
హైద్రాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ని తిలకించేందుకు అభిమానులు పోటెత్తారు. టాలీవుడ్ హీరో వెంకటేష్, సన్ రైజర్స్ జట్టుకి మద్దతుగా మైదానంలో సందడి చేశాడు. క్రికెట్‌పై అంతులేని అభిమానం వెంకటేష్‌కి. ఐపీఎల్ మ్యాచ్‌లు హైద్రాబాద్‌లో ఎప్పుడు జరిగినా, అక్కడ ఆయన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా! మరోపక్క, ఉప్పల్ స్టేడియంలో తమ అభిమాన జట్టు చెలరేగిపోతోంటే, సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు అభిమానుల్లో ఆనందం ఆకాశాన్నంటేసింది. మైదానంలోకి ఎంట్రీ లభించడంతోనే అభిమానుల హంగామా షురూ అయ్యింది. అంతకు ముందు గేట్లు తెరుచుకునేదాకా అభిమానులు స్టేడియం ముందు చేసిన హంగామా తక్కువేమీ కాదు. గ్యాలరీల్లో అభిమానుల హంగామా, మైదానంలో సన్ రైజర్స్ ధమాకా వెరసి ఉప్పల్ స్టేడియం మార్మోగిపోయిందంతే.
ఈ టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తయితే, ఈ మ్యాచ్ ఒక్కటీ ఒక ఎత్తన్నట్లుగా సాగింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తా చాటిన సన్ రైజర్స్ రాజస్తాన్ రాయల్స్‌కే కాదు, ఈ టోర్నీలో మిగతా జట్లన్నిటికీ 'స్వీట్ వార్నింగ్' ఇచ్చినట్లయ్యింది. టైటిల్ ఫేవరెట్స్‌లో సన్ రైజర్స్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ వివాదాన్ని ఎదుర్కొనడం, ఈ కారణంగా ఏడాది సస్పెన్షన్ వేటుకు గురవడం తెల్సిన విషయాలే. ఆ వార్నర్, సన్ రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సి వుంది. నిషేధం కారణంగా ఐపీఎల్‌కి కూడా దూరమయ్యాడు వార్నర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వార్నర్‌కి మంచి ట్రాక్ రికార్డ్ వుంది. సన్ రైజర్స్‌కి మంచి నాయకుడిగా సేవలందించాడు గతంలో వార్నర్. ఈ నేపథ్యంలో వార్నర్ లేని లోటుని అభిమానులు బాగా ఫీలయ్యారు. అయితే, వార్నర్ లేకపోయినా సన్ రైజర్స్ సత్తా చాటడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







