ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థి...

ఆత్మహత్య చేసుకున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థి...

గచ్చిబౌలీలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సునంద్ రెడ్డి అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన శ్రీనివాస రెడ్డి, మయూరి దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరు సునంద్ రెడ్డి.హైదరాబాదులోని  ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో డ్యూయల్ డిగ్రీ 4 వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులందరితో బాగానే ఉండేవాడు. చదువులో కూడా సునంద్ మెరిట్ విద్యార్థి. అయితే మూడు రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు. స్నేహితులు ఆరా తీయగా ఏమీ లేదన్నాడు. ఒంటరిగా వదిలేయమన్నాడు. ఎవరితో మాట్లాడకుండా మూడు రోజుల నుంచి హాస్టల్ రూములోనే ఉన్నాడు. హాస్టల్ నుంచి బయటకు రాకపోవడం, ఫోన్ కూడా లిప్ట్ చేయక పోవడంతో స్నేహితులకి అనుమానం వచ్చి రూమ్‌కి వెళ్లారు. 

గడియ పెట్టి ఉండడంతో కిటికీలోనుంచి చూశారు. రూమ్ లోని ప్యానుకు సునంద్ రెడ్డి వేలాడుతూ కనిపించాడు. ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేని స్నేహితులు సెక్యూరిటీ సహాయంతో తలుపులు పగుల గొట్టారు. లోపలికి వెళ్లి జీవచ్చవంలా పడి ఉన్న సునంద్ రెడ్డిని చూసి భోరుమన్నారు. కాలేజీ లెక్చరర్‌లు పోలీసులకు, తల్లి దండ్రులకు సమాచారమందించారు. పోలీసులకు అతడి రూమ్‌లో సూసైడ్ నోట్‌లు రెండు గుర్తించారు. అందులో ఒక లెటర్ తల్లి దండ్రులకు రాశాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, మన బంధుత్వ వ్యవస్థ సరిగా లేదని, అవసరానికి మాత్రమే వాడుకుంటారని లేఖలో వివరించాడు. అమ్మానాన్న మీరంటే నాకు చాలా ఇష్టం.. మిమ్మల్ని వదిలి వెళుతున్నందుకు క్షమించడి అని లేఖలో పేర్కొన్నాడు. మరొక లేఖ సినీ నటుడు మహేష్ బాబుని ఉద్దేశించి రాశాడు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ సినిమాలు అన్నీ చూస్తాను. మీరు నా డాక్టర్, నాకు స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి అని లేఖలో రాశాడు. రూమ్‌లో కూడా అన్నీ మహేష్ బాబు ఫొటోలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

Back to Top