వాట్సాప్‌ సిఈఓ గా భారతీయుడు.!

- May 05, 2018 , by Maagulf
వాట్సాప్‌ సిఈఓ గా భారతీయుడు.!

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సామాజిక సమాచార మాధ్యమం వాట్సాప్‌ పగ్గాలు త్వరలో ఓ భారతీయుడి చేతికి అందబోతున్నాయి. వాట్సాప్‌ సీఈవో జాన్‌ కువోమ్‌ పదవి నుంచి వైదొలగబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే.

డేటా ప్రైవసీ, ఎన్‌క్రిప్షన్‌ తదితర సమస్యలపై వాట్సాప్‌కు, దాని మాతృ సంస్థ ఫేస్‌బుక్‌కు మధ్య విభేదాలు తలెత్తడంతో కువోమ్‌ వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కొత్త సీఈవో కోసం వాట్సాప్‌ సంస్థ అన్వేషణ మొదలుపెట్టింది. వాట్సాప్‌లో ట్రేడ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన నీరజ్‌ అరోరాను ఆ పదవిలో నియమించాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2011 నుంచి వాట్సాప్‌లో పనిచేస్తున్న అరోరాకు ఆ సంస్థతో దాదాపు ఆరున్నరేండ్ల అనుబంధం ఉంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడానికి ముందు నుంచే ఆయన ఆ సంస్థలో పనిచేస్తున్నారు. విలీనాలు, కొనుగోళ్లలో ఎంతో నిష్ణాతునిగా పేరుపొందిన అరోరా వాట్సాప్‌ వృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు.

వాట్సాప్‌ సంస్థలో చేరడానికి ముందు ఆయన ప్రముఖ డిజిటల్‌ వాలెట్‌ పేటిఎంలో కూడా పనిచేశారు. పేటిఎం డైరెక్టర్ల బోర్డులో 33 నెలల పాటు పనిచేసిన అనుభవం అరోరాకు ఉంది. అంతకుముందు అరోరా గూగుల్‌ సంస్థలో కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గానూ, ఆ తర్వాత ప్రిన్సిపల్‌ మేనేజర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. అరోరా 2000లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఢిల్లీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com