దర్శకురాలిగా మారిన తమిళ హీరోయిన్‌

- May 07, 2018 , by Maagulf
దర్శకురాలిగా మారిన తమిళ హీరోయిన్‌

చెన్నై: 'కలాబకాదలన్‌' చిత్రంలో ఆర్యకు మరదలిగా కనిపించి ఆకట్టుకుంది నటి అక్షయ. ఆ తర్వాత విజయ్‌కాంత్‌ నటించిన 'ఎంగల్‌ ఆసాన్‌', 'ఓసై' తదితర చిత్రాల్లో నటించారు. నటిగా మెరిసిన ఆమె చాలా గ్యాప్‌ తర్వాత దర్శకురాలిగా తెరపై అడుగు పెడుతున్నారు. ఏబీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.బాలచందర్‌ నిర్మిస్తున్న 'యాళి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె కథానాయికగానూ నటిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో తమన్‌ ఊర్వశి, మనోబాలా ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కీలక పాత్రలో మెరవనున్నారు. చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అక్షయ సమకూర్చారు.

ఈ సినిమా గురించి అక్షయ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులకు ప్రత్యేక స్థానముంది. వారి జాబితాలో నేను కూడా చేరతాననే నమ్మకం ఉంది. ఇది ఒక రొమాంటిక్‌, థ్రిల్లర్‌ కథాంశం. ముంబయి నేపథ్యంలో సినిమా నడుస్తుంది. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ కథ సాగుతుంది. హీరో, హీరోయిన్‌కు ఏమాత్రం సంబంధం లేని అర్జున్‌.. వారిని ఫాలో అవుతుంటారు. ఈ సమయంలోనే ముంబయిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలతో వీరికి గల సంబంధం ఏంటి..? అర్జున్‌ ఎందుకు వీరిని అనుసరిస్తున్నారు..? వంటి ఆసక్తికరమైన అంశాలతో కథనం రచించాం. ఇప్పటి వరకు చిత్రీకరణను ముంబయి, మలేషియా, చెన్నైలో జరిపాం. జూన్‌లో ఆడియోను విడుదల చేసి, జులైలో చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నాం. కథానాయికగా ప్రేక్షకులకు పరిచయమున్న నేను.. ఇప్పుడు దర్శకురాలిగా కూడా అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రయత్నానికి ప్రేక్షకులు తప్పకుండా వెన్నంటే ఉంటారన్న నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com