హైదరాబాద్ లో ఇండిపెండెంట్ ఇల్లు..

- May 19, 2018 , by Maagulf
హైదరాబాద్ లో ఇండిపెండెంట్ ఇల్లు..

హైదరాబాద్ నగరంలో ఇల్లు ఉందంటే.. అబ్బో పర్లేదే.. సిటీలో ఇల్లు కొనుక్కున్నావ్.. ఇంకేం లైఫ్ హ్యాపీస్.. అంటూ ఉంటారు స్నేహితులు, బంధువులు కూడా. లక్షలు లోన్ తీసుకుని ఓ పేద్ద అపార్ట్‌మెంట్‌‌లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొంటే లోపలి వరకే మనది. తలుపులు తెరిస్తే మనది కాదు. ఏం చేసుకోవాలన్నా లోపలే చెయ్యాలి. అదే ఇండిపెండెంట్ ఇల్లయితే హాయిగా మనకు నచ్చినట్లు ఉండొచ్చు. ఇంటి చుట్టూ మొక్కలు, ఇంట్లో ఓ చిన్న పప్పీ.. అడిగే వాళ్లే లేరు. కానీ ఎంత మందికి ఆ కల నిజమవుతుంది. బడ్జెట్ పద్మనాభాలకి అది సాధ్యం కాకపోవచ్చు అని ఇంతకు ముందు వరకు ఉండేది. అయితే ఇప్పుడు అది సాధ్యమే అని అంటున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు. మీకు అందుబాటు ధరలోనే ఇళ్లు దొరుతున్నాయని అంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాలు గ్రేటర్‌లో విలీనం కావడంతో స్థిరాస్థి మార్కెట్ ఊపందుకుంది. ఒకప్పుడు అటు ఎల్‌బీనగర్, ఇటు మియాపూర్ ఏరియాలో ఇల్లంటే బాబోయ్ అంత దూరమా అనే వారు. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఏరియా నుంచి గంట ప్రయాణం అంటే చాలా దగ్గర అన్నట్లే. ఆ ప్రాంతాలు కూడా నగరంలో కలిసిపోయినట్లుగా ఉంటున్నాయి. ఎక్కడికక్కడ విస్తరిస్తున్న షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ అన్నీ అందుబాటులో ఉండడంతో నగరానికి దూరంగా ఉంటున్నట్లు అనిపించట్లేదు ఎవరికీ. అందుకే ధైర్యంగా కొనేస్తున్నారు. రేటు కూడా వారికి అందుబాటులోనే ఉంటుంది. విస్తీర్ణాన్ని బట్టి 180 గజాల ఇళ్లు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు చెబుతున్నారు. అక్కడ కొన్ని కట్టిన ఇళ్లు దొరుకుతుంటే మరి కొన్ని ఏరియాల్లో స్థలాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. 

నగరంలోని ప్రధాన కేంద్రాలకు 5 నుంచి 10 కి.మీ చేరువలో ఇండిపెండెంట్ ఇళ్లు లభ్యమవుతున్నాయి. ఆ ఏరియాలు ఓ సారి చూస్తే..

* చెంగిచర్ల నుంచి వరంగల్ జాతీయరహదారి వరకు స్థలాలు, ఇళ్లు నిర్మించి అమ్ముతున్నారు. 
* ఉప్పల్, బోడుప్పల్ దాటిన తరువాత మేడిపల్లి, నారపల్లి, పోచారం, రాంపల్లి, జోడిమెట్ల, అన్నోజిగూడ, ఘట్‌కేసర్ వరకు ఇళ్లు అందుబాటు ధరలో ఉన్నాయి. 
* ఫిర్జాదిగూడ, కొర్రెముల, ప్రతాప సింగారం, బాచారం వరకు అందుబాటు ధరల్లో ఉన్నాయి. 
* కుషాయిగూడ, కాప్రా, దమ్మాయిగూడ, అహ్మద్‌గూడ, చేర్యాల, కీసరగుట్ట మార్గంలో కూడా ఇండిపెండెంట్ ఇళ్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి. 
* హయత్ నగర్ దాటాక కూడా ఇళ్లు అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి. 
* తుర్కయాంజల్, తొర్రూర్, మన్నెగూడ, రాగన్నగూడ, బొంగుళూరు ప్రాంతాల్లో కూడా ఇండిపెండెంట్ ఇళ్లు దొరుకుతున్నాయి. 
* బాలానూర్ తరువాత మల్లాపూర్ వరకు ఇళ్లు నిర్మిస్తున్నారు. 
ఏరియా డెవలప్‌మెంట్ లేదని కొనకుండా వచ్చిన ఆరు నెలల్లోనే డిమాండ్ పెరగడంతో పాటు ధర కూడా పెరుగుతుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఇండిపెండెంట్ ఇల్లు కొనేస్తే మంచిదేమో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com