వారి వల్లే ఈ విధ్వంసం జరిగింది:రజినీ

- May 30, 2018 , by Maagulf
వారి వల్లే ఈ విధ్వంసం జరిగింది:రజినీ

కాలాకు కోపమొచ్చింది.. తమిళనాడులోని తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాల వెతలు చూసి ఆయన చలించిపోయారు. కాల్పులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో  మండిపడ్డారు. పోరాటంలో అసాంఘిక శక్తులు చొరబడడం వల్లే ఈ విధ్వంసం జరిగిందన్నారు. దీనిపై ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఉండొచ్చన్నారు. కానీ, సరైన చర్యలు తీసుకోలేకపోయిందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. పళనిస్వామి ప్రభుత్వానికి ఇదో పాఠమన్న రజనీ.. మళ్లీ స్టెరిలైట్ కంపెనీని తెరవకుండా చూడాలన్నారు. అదే సమయంలో కంపెనీ యాజమాన్యం కూడా కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిందంటూ విమర్శించారు.. 

స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో 100వ రోజు హింసాత్మకంగా మారింది. ఈనెల 22, 23 తేదీల్లో తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వచ్చిన వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యల్లో గాయపడ్డారు. ఆందోళనకారుల ఆగ్రహంతో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలను తగలబెట్టారు.

తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను స్వయంగా కలిసి ఓదార్చారు రజనీకాంత్.  ఆ వెంటనే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసుల కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. తరువాత పోలీసు కాల్పుల్లో గాయపడినవారు చికిత్స పొందుతున్న ప్రభుత్వ  ఆసుపత్రికి రజనీకాంత్ వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న నిరసనకారులను పరామర్శించి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు..

రాష్ట్రంలో ఏ జరుగుతోందన్నది ప్రజలకు తెలుసునని, సమయం వచ్చినపుడు సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదని, రాజీనామా పరిష్కారం కాదని రజనీ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com