మోడీని చిరునవ్వుతో పలకరించిన ఏ.పి సి.యం

- June 17, 2018 , by Maagulf
మోడీని చిరునవ్వుతో పలకరించిన ఏ.పి సి.యం

న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని మోడీని చిరునవ్వుతో పలకరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ల తో కలిసి ఆయన సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమయంలో తనకు ఎదురుపడిన ప్రధాని మోడీని చంద్రబాబు చిరునవ్వుతో పలకరించారు. మోడీ కూడా చిరునవ్వుతోనే ప్రతిస్పందించారు. మరోవైపు

ప్రధాని మోడీ, అమిత్ షా పై టిడిపి నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ టీమ్ ఇండియా స్ఫూర్తికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గండి కొడుతోందని విమర్శించారు. అయినా టీమ్ ఇండియా అంటే మోడీ, అమిత్ షాలు మాత్రమే కాదన్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజా రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. దేశంలో పలు సమస్యలు ఉండే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అజెండాలో కేవలం ఆరు అంశాలకే చోటు ఇవ్వడం దారుణమని యనమల వ్యాఖ్యానించారు. ఏపీకి జరిగిన అన్యాయం, జీఎస్టీ లొసుగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో గళమెత్తుతారని యనమల చెప్పారు.

మరోవైపు ప్రధాని మోడీపై అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని జేసీ దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను చూసేందుకు వెళ్లిన సీఎంలను ప్రధాని మోడీ అడ్డుకుని అవమానించారని జెసి విమర్శించారు. ఢిల్లీ సీఎంను కలవకుండా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ముఖ్యమంత్రులకు అవకాశం ఇవ్వకపోవడం విచారకరమని జెసి ధ్వజమెత్తారు. మరో ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ మోడీ సమస్యను పరిష్కరించడాన్ని పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారని, ఇది దారుణమని విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com