ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌కి అమెరికా గుడ్‌బై

- June 19, 2018 , by Maagulf
ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌కి అమెరికా గుడ్‌బై

ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌కి అమెరికా గుడ్‌బై వాషింగ్టన్‌: ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ నుంచి అగ్రరాజ్యం అమెరికా వైదొలగింది. ఇజ్రాయెల్‌ పట్ల పక్షపాత వైఖరి చూపుతున్నందున తాము ఈ కౌన్సిల్‌ నుంచి బయటకు వెళ్తున్నట్లు అమెరికా వెల్లడించింది. అలాగే కౌన్సిల్‌లో సంస్కరణలు లేవని తెలిపింది. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఈ విషయాన్ని వెల్లడించారు. హేలీ తన పదవీకాలంలో ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌లో మార్పులు చేయాలని అడుగుతూ వచ్చారు. కౌన్సిల్‌లో సంస్కరణలకు ప్రయత్నించిన అమెరికాను రష్యా, చైనా, క్యూబా, ఈజిప్ట్‌లు అడ్డుకున్నాయని హేలీ విమర్శించారు. అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు కూడా తమను ప్రోత్సహించకుండా కౌన్సిల్‌ను యథాతథంగా ఉంచేందుకు మొగ్గుచూపాయని హేలీ విమర్శలు చేశారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందం, 2015 ఇరాన్‌ న్యూక్లియర్‌ డీల్‌ల నుంచి కూడా అమెరికా వైదొలగిన సంగతి తెలిసిందే. తాజాగా ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం అమెరికా-మెక్సికో సరిహద్దుల వద్ద అక్రమ వలసదారుల వద్ద నుంచి వారి పిల్లలను వేరు చేస్తుడడంపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం విదితమే. దీనిపై ఐరాస మానవహక్కుల విభాగం చీఫ్‌ జైడ్‌ రాడ్‌ అల్‌ హుస్సేన్‌ కూడా స్పందించారు.

అమెరికా ఈ విధానాన్ని వెంటనే నిలిపేయాలని హుస్సేన్‌ సోమవారం వెల్లడించారు. మరుసటి రోజే అమెరికా కౌన్సిల్‌ నుంచి బయటకు వచ్చేయడం గమనార్హం. ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌ను 2006లో ఏర్పాటు చేశారు. 47 సభ్య దేశాలున్న ఈ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న మొదటి దేశం అమెరికానే అని ఐరాస అధికారులు వెల్లడించారు.ఈ కౌన్సిల్‌ ఏడాదికి మూడు సార్లు సమావేశమై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై చర్చిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com