స్టార్లు లేకుండా తీసినందుకు ఆశ్చర్యపోయా..!

- June 25, 2018 , by Maagulf
స్టార్లు లేకుండా తీసినందుకు ఆశ్చర్యపోయా..!

స్టార్లు లేకుండా తీసినందుకు ఆశ్చర్యపోయా - కేటీఆర్‌ తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. సురేష్‌బాబు నిర్మాత. వివేక్‌సాగర్‌ స్వరాలు అందించారు. ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా 'ఈ నగరానికి ఏమైంది' పాటల సీడీ విడుదలైంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ''చేనేత కళాకారులకు మద్దతుగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలే ధరించాలనే ఓ నియమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులంతా చేనేత వస్త్రాలే ధరిస్తారని మాట ఇచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చా. ఈ టైటిల్‌ చూసి కంగారు పడ్డాను. ఎందుకంటే నేను తెలంగాణ పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని. వర్షాకాలం వస్తే చాలు..
'ఈ నగరానికి ఏమైంది' అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెడుతుంటారు. అలాంటి కథేమో అనుకున్నా. కానీ కాదని తెలిసింది. తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వం వహించిన 'పెళ్లిచూపులు' సినిమా అంటే చాలా ఇష్టం.
తరుణ్‌ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. కానీ ఎప్పుడూ సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడేవాడు కాదు. 'పెళ్లి చూపులు సినిమా చూడండి. మీకు బాగా నచ్చుతుంది' అని సురేష్‌బాబు చెప్పడంతో ఆ సినిమా చూశా.
చిత్రబృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. ఓ చిత్రం విజయవంతమైన తరవాత రెండో చిత్రానికి పేరున్న నటులు, డబ్బులు, హంగామా అన్నీ వచ్చేస్తాయి. కానీ స్టార్స్‌ లేకుండా సినిమా తీశానని తరుణ్‌ భాస్కర్‌ చెప్పగానే నాకేం అర్థం కాలేదు. ఆశ్చర్యపోయా.
రోడ్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. 'హ్యాంగోవర్‌', 'జిందగీ నా మిలేగే దుబారా' లాంటి సినిమాల్ని ఇష్టపడతాను. ఈ సినిమా కూడా ఆ కోవకే చెందుతుందనిపిస్తోంది. చిత్రసీమలో ఇప్పుడు మార్పు కనిపిస్తోంది.
సందీప్‌, సంకల్ప్‌ లాంటి మంచి దర్శకులు వస్తున్నారు. సరిహద్దులు చెరిపేస్తున్నారు. తరుణ్‌ భాస్కర్‌ ఇక ముందు కూడా స్టార్లని కాకుండా కథల్ని నమ్మి ఇలాంటి మంచి సినిమాలు తీయాలి. ఈ చిత్రం 'పెళ్లి చూపులు' కంటే మంచి పేరు తీసుకురావాలి'' అన్నారు.
రానా మాట్లాడుతూ ''తరుణ్‌ అంటే చాలా ఇష్టం. కాలేజీలో తను నా జూనియర్‌. తొలి సినిమాతో విజయం సాధిస్తే.. పరిశ్రమ కలుషితం చేసేస్తుంది.
కానీ ఆ మార్గంలోకి వెళ్లకుండా మరో మంచి కథ చెబుదామని ప్రయత్నించాడు తరుణ్‌. ఇక ముందు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలి. మంచి మంచి కథలు చెప్పాల''న్నారు. కార్యక్రమంలో ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com