చంద్రబాబు నాయుడు మరోసారి సింగపూర్ పర్యటన:జులై 8,9 తేదీల్లో టూర్

- July 01, 2018 , by Maagulf
చంద్రబాబు నాయుడు మరోసారి సింగపూర్ పర్యటన:జులై 8,9 తేదీల్లో టూర్

అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జులై 8, 9 తేదీల్లో ఆయన సింగపూర్‌లో పర్యటిస్తారు. ఆయా తేదీల్లో సింగపూర్ లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో సిఎం చంద్రబాబు పాల్గొంటారు.

ఈ పర్యటనలో సిఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, సీఆర్‌డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారుల బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సులో రాజధాని అమరావతి గురించి చంద్రబాబు ప్రసంగిస్తారని తెలిసింది. అందుకోసం సీఆర్‌డీఏ అక్కడ అమరావతికి సంబంధించి ప్రత్యేక పెవిలియన్‌ను కూడా ఏర్పాటు చేయనుందని సమాచారం.

సింగపూర్‌లో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ స్థాయి సదస్సు ప్రపంచ నగరాల సదస్సు(డబ్ల్యూసీఎస్‌). ఈ సదస్సు ఈసారి జులై 8-12 వరకు జరగనుంది. అయితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతత్వంలోని ఆంధ్రప్రదేశ్ బృందం ఈ సదస్సులో తొలి రెండు రోజులే పాల్గోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సింగపూర్‌ బృందం ఆంధ్రా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆ దేవపు మంత్రి ఈశ్వరన్‌ ఈ సదస్సులో పాల్గోవాల్సిందిగా సిఎం చంద్రబాబుని ఆహ్వానించారట. ఆయన ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు ఈ నెల 8న ఉదయం డబ్ల్యూసీఎస్‌లో జరిగే ప్రపంచ మేయర్ల ఫోరంలో చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేస్తారని తెలిసింది.

ఆధునిక నగరాలలో ఉండాల్సిన సమతుల్య అభివృద్ది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా సంస్థల మధ్య ఉండాల్సిన సమన్వయం, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి అంశాలు చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. అనంతరం అదే రోజు సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో చంద్రబాబు పాల్గొంటారు. ఆ క్రమంలోనే వివిధ కంపెనీలు, సంస్థల ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో కూడా పాల్గొంటారు.

అలాగే జులై 9 ఉదయాన్నే జరిగే 'జాయింట్‌ ఓపెనింగ్‌ ప్లీనరీ సదస్సు'లో కూడా సీఎం చంద్రబాబు మరోసారి ప్రసంగిస్తారు. ఇక ఈ సదస్సు సందర్భంగా ఇక్కడి ప్రాంగణంలో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసే అమరావతి పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా శ్రద్ద వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానిలో పెట్టుబడులకు అవకాశమున్న వివిధ ప్రాజెక్టులు, అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాల్ని ఇందులో ప్రదర్శిస్తారు. సిఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు వెంట వెళ్లనున్నట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com